Jhukunga Nahin : ‘పుష్ప’ సినిమాలోని ‘తగ్గేదేలే’ డైలాగ్ గుర్తుంది కదూ. ఇవాళ రాజ్యసభ వేదికగా ఆ డైలాగ్ చెప్పి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హూంకరించారు. వక్ఫ్ భూములు కబ్జా చేశానంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బుధవారం తనపై చేసిన ఆరోపణలను ఖర్గే తీవ్ర స్థాయిలో ఖండించారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధంగా లేకుంటే.. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సారీ చెప్పాలని అనురాగ్ ఠాకూర్‌ను డిమాండ్ చేశారు. ఠాకూర్‌కు పార్లమెంటులో ఉండే అర్హత లేదంటూ ఖర్గే ధ్వజమెత్తారు. ‘‘నేను బీజేపీ పొలిటికల్ డ్రామాలకు బెదిరే వ్యక్తిని కాదు. భయపడి పారిపోయే వ్యక్తిని కాదు. మీ ముందు సాగిలాపడే మనిషిని(Jhukunga Nahin) అంతకంటే కాదు. విరిగిపోతా కానీ సాగిలాపడను.. తగ్గేదేలే ’’ అంటూ ఖర్గే ఫైర్ అయ్యారు. ఇవాళ(గురువారం) రాజ్యసభ జీరో అవర్‌లో ఈ విషయాన్ని ఖర్గే లేవనెత్తారు.
Also Read :Anchor Pradeep: రాజకీయ నాయకురాలితో మ్యారేజ్.. యాంకర్ ప్రదీప్ రియాక్షన్
ఠాకూర్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.. అందుకే..
‘‘నా జీవితం తెరిచిన పుస్తకం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ప్రజా జీవితంలో తలెత్తుకొని నిలబడ్డా. అలాంటి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు’’ అని ఖర్గే చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రశ్నించడంతో ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికల్లో ఠాకూర్ చేసిన ఆరోపణలే వైరల్ అవుతున్నాయి. అందుకే నేను ఇలా నిలబడి ఆరోపణలను ఖండించాల్సి వస్తోంది. ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు సభాపక్ష నేత క్షమాపణలు చెప్పాలి’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. దశాబ్దాల తరబడి దేశాన్ని కాంగ్రెస్ పాలించబట్టే నేటి వరకు వక్ఫ్ భూములు సురక్షితంగా ఉండగలిగాయన్నారు.