Jharkhand Elections 2024: వచ్చే నెలలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ సీట్లకుగానూ 70 సీట్లలో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కలిసి పోటీ చేయనున్నాయి. మిగితా 11 అసెంబ్లీ సీట్లను ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలకు కేటాయించారు. 70 సీట్లలో ఎక్కువ భాగాన్ని జేఎంఎం(Jharkhand Elections 2024) పార్టీకే ఇవ్వనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఎక్కువ సీట్లను జేఎంఎం పార్టీయే గెల్చుకుంది. నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు విడతల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కిస్తారు.
Also Read :Jharkhand Polls : జార్ఖండ్ డీజీపీపై ఈసీ వేటు.. కీలక ఆదేశాలు జారీ
మరోవైపు ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాల మధ్య కూడా సీట్ల పంపకాలు ఇటీవలే కొలిక్కి వచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం 81 సీట్లకుగానూ ఈసారి 68 చోట్ల బీజేపీ పోటీ చేస్తోంది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 10 సీట్లు జేడీయూకు 2 సీట్లు, ఎల్‌జేపీకి 1 సీటును కేటాయించారు.
Also Read :NCW Chairperson : జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్
మొదటి దశ పోలింగ్ జరగనున్న 43 అసెంబ్లీ స్థానాల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈనెల 25 వరకు ఆయా చోట్ల నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరిస్తారు. 2019 ఎన్నికలలో జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి 47 స్థానాలను గెలుచుకుంది. వీటిలో 30 స్థానాలను జేఎంఎం, 16 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లకు పరిమితం అయింది. ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీలో 74 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల కోసం కూడా ఎన్డీయే, ఇండియా కూటములు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అత్యధిక ఎంపీ స్థానాలను కలిగిన మహారాష్ట్రలో గెలవడం ద్వారా తమ ప్రాబల్యాన్ని చాటుకోవాలని ఈ కూటములు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ పోరులో ఎవరిని విజయం వరిస్తుందో వేచిచూడాలి.