Site icon HashtagU Telugu

Waqf Bill: వ‌క్ఫ్ బిల్లుపై సుప్రీంలో స‌వాల్ చేసిన కాంగ్రెస్‌, ఎంఐఎం.. ఏం జ‌ర‌గ‌బోతుంది..?

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Waqf Bill: దేశ వ్యాప్తంగా విస్తృత చ‌ర్చ‌తోపాటు అధికార‌, విప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదాల‌కు దారితీసిన వ‌క్ఫ్ (స‌వ‌ర‌ణ‌) బిల్లు-2025 పార్ల‌మెంట్‌, రాజ్య‌స‌భ‌ల్లో ఆమోదం పొందింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర‌ప‌తి ఆమోదానికి పంపించ‌నుంది. రాష్ట్ర‌ప‌తి ఆమోదిస్తే బిల్లు చ‌ట్టంగా రూపుదిద్దుకోనుంది. అయితే, ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు స‌హా ప‌లు పార్టీలు వ్య‌తిరేకిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌, ఎంఐఎం సుప్రీంకోర్టులో స‌వాల్ చేశాయి. కాంగ్రెస్ ఎంపీ మ‌హ్మ‌ద్ జావేద్‌, ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సుప్రీంకోర్టులో అస‌దుద్దీన్ స‌వాల్ చేశారు.

Also Read: Nominated Posts: ఏపీలో 38 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన‌.. జ‌న‌సేన‌కు కేటాయించినవి ఇవే

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ‌క్ఫ్ (స‌వ‌ర‌ణ‌) బిల్లు వ‌క్ప్ ఆస్తులు, వాటి నిర్వ‌హ‌ణ‌పై ఏక‌ప‌క్షంగా ఉంద‌ని, ముస్లిం స‌మాజానికి చెందిన మ‌త‌ప‌ర‌మైన స్వ‌యంప్ర‌తిప‌త్తిని దెబ్బ‌తీస్తుంద‌ని కాంగ్రెస్ ఎంపీ త‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు ఈ పిటిష‌న్ల‌పై ఎలా స్పందిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. రెండు రోజుల పాటు జ‌రిగిన సుదీర్ఘ చ‌ర్చ‌, తీవ్ర స్థాయి వాదోప‌వాదాల అనంత‌రం వ‌క్ఫ్ (స‌వ‌ర‌ణ‌) బిల్లు-2025 పార్ల‌మెంట్ లో ఆమోదం పొందింది. గురువారం అర్థ‌రాత్రి త‌రువాత రాజ్య‌స‌భ‌లో ఆమోదం ల‌భించింది.

Also Read: Annamalai : తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసులో లేను : అన్నామలై

లోక్‌స‌భ‌లో వ‌క్ఫ్ బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లురాగా.. వ్య‌తిరేకంగా 232 ఓట్లు వ‌చ్చాయి. దీంతో మెజార్టీ ఓటు శాతంతో పార్ల‌మెంట్ లో బిల్లు ఆమోదం పొందింది. ఇక రాజ్య‌స‌భ‌లో ఈ బిల్లుపై సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. దాదాపు ప్ర‌తి స‌వ‌ర‌ణ‌పైనా ఓటింగ్ కు విప‌క్షాలు ప‌ట్టుబ‌ట్టాయి. వాటి స‌వ‌ర‌ణ‌ల‌న్నీ వీగిపోయాయి. చివ‌రికి బిల్లు ఆమోదం పొందింది. దీనికి అనుకూలంగా 128, వ్య‌తిరేకంగా 95 ఓట్లు పోల‌య్యాయి. దీంతో వ‌క్ఫ్ బిల్లును కేంద్రం రాష్ట్ర‌ప‌తి ఆమోదానికి పంప‌నుంది.

 

వక్ఫ్ (సవరణ) బిల్లులోని కొన్ని నిబంధనలు..
– ఐదు సంవత్సరాలకుపైగా ఇస్లాంను ఆచరిస్తున్న వ్యక్తులు మాత్రమే వక్ఫ్ అంకితం చేయగలరు.
– వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 అన్ని వక్ఫ్ ఆస్తులను రికార్డ్ చేయడానికి ఒక డిజిటల్ పోర్టల్‌ను పరిచయం చేస్తుంది, నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి.
– కేంద్రం ప్రతిపాదిత వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 ను UMEED గా పేరు పెట్టింది, ఇది వక్ఫ్ ఆస్తుల ఏకీకృత నిర్వహణ సాధికారత సామర్థ్యం మరియు అభివృద్ధి కోసం దాని ప్రయత్నాలను నొక్కి చెబుతుంది.
– 1995 వక్ఫ్ చట్టం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా వక్ఫ్ ఖాతాలను ఆడిట్ చేయవచ్చు, సవరించిన బిల్లులో కేంద్రానికి రిజిస్ట్రేషన్, వక్ఫ్ ఖాతాల ప్రచురణ, వక్ఫ్ బోర్డుల కార్యకలాపాల ప్రచురణకు సంబంధించి నియమాలు రూపొందించే అధికారం ఉంది.
– సవరించబడిన బిల్లులో షియా మరియు సున్నీ వర్గాలతో పాటు బోహ్రా మరియు అగాఖానీ వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులను అనుమతించారు.