UNESCO : కోల్ క‌తా దుర్గాపూజ‌కు యునెస్కో గుర్తింపు

కోల్‌కతాలోని దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు ల‌భించింది.దీనిని అధికారికంగా యునెస్కో ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.

  • Written By:
  • Publish Date - December 16, 2021 / 10:55 AM IST

కోల్‌కతాలోని దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు ల‌భించింది.దీనిని అధికారికంగా యునెస్కో ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. దుర్గామాత పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే తీరును జనం మెచ్చిన ఉత్తమ ప్రదర్శనగా గుర్తిస్తూ ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ అనే జాబితాలో స్థానం కల్పించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక, సంప్రదాయల జాబితాలో శ్రేష్టమైన హోదా కల్పిస్తూ యునెస్కో ట్వీట్ చేసింది.

దుర్గాపూజ‌కు యునెస్కో గుర్తింపు రావ‌డం ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌శంసించారు. యునెస్కో నిర్ణయం ప్రతి భారతీయుడికి గొప్ప గర్వంకార‌ణ‌మ‌ని…సంతోషకరమైన విషయమ‌ని మోడీ ప్రశంసించారు. దుర్గా పూజ మన సంప్రదాయాలని హైలైట్ చేస్తుందని.. కోల్‌కతా దుర్గా పూజ ప్రతి ఒక్కరూ తప్పక చేయాల‌ని ఆయ‌న తెలిపారు. దుర్గాపూజ కేవలం పండుగ కాదని..అదొక భావోద్వేగమని ముఖ్యమంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి బెంగాలీకి దుర్గాపూజ అనేది పండుగ కంటే చాలా ఎక్కువని ఆమె తెలిపారు.

ప్రసిద్ధ నిర్మాణాలు, పురాతన కట్టడాలకు యునెస్కో ఇచ్చే వారస్తవ సంపద గుర్తింపు, ‘ఇంటాంజిబుల్’ గుర్తింపు వేరు. ఈ సాంస్కృతిక జాబితాలో ఎప్పటికప్పుడు ప్రతియేటా కొత్త అంశాలు వచ్చి చేరుతుంటూనే ఉంటాయి. 2017లో మనదేశంలో జరుపుకునే కుంభమేళాకు ఈ గుర్తింపు లభించింది. అంతకు ముందటి సంవత్సరంలో యోగాను యునెస్కో ఈ జాబితాలో చేర్చింది. అంతకు ముందూ మన దేశానికి చెందిన పలు అంశాలు ఈ జాబితాలో చేరుతూ వచ్చాయి.ఇటీవలే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే.

ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా.. మనదేశం నుంచి 2020కి గాను రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. బెంగాల్ దుర్గా పూజకు దేశంలోనే అత్యంత ప్ర‌శ‌స్తి ఉంటుంది. న‌వ రాత్రుల్లో అక్క‌డ జ‌రిగే దుర్గా పూజ‌లు విశేష ప్రాచుర్యం పొందాయి.ఈ పూ.కు యునెస్కో గుర్తింపు పొందడంతో బెంగాలీలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని బెంగాలీలు సంబ‌రాలు చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని డాక్ట‌ర్ ర‌చ‌నా బెన‌ర్జీ ప్ర‌తీ భార‌తీయుడికీ ఇది గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు. మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించే దుర్గాపూజ‌ను ప్ర‌తీ భార‌తీయుడు చూడాల‌ని అన్నారు.