Site icon HashtagU Telugu

Communist Parties : ఉనికి కోసం పోరాడుతున్న క‌మ్యూనిస్టు పార్టీలు..

Cpi Cpm Flags

Cpi Cpm Flags

నిజాం నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హించిన క‌మ్యూనిస్టు పార్టీ త‌ర్వాతి కాలంలో సైద్ధాంతిక విభేదాల‌తో మూడు స్ర‌వంతులుగా చీలిపోయింది. సీపీఐ చీలి సీపీఎం ఏర్ప‌డితే..సీపీఎం నుంచి తీవ్ర‌వాద ఆలోచ‌న‌లున్న నేత‌లు పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యాన్నే నిర‌సిస్తూ బెంగాల్ లోని న‌క్స‌ల్బ‌రీ పోరాట స్ఫూర్తితో న‌క్స‌లైట్లుగా మారారు. న‌క్స‌ల్ పార్టీ కూడా త‌ర్వాతి కాలంలో అనేక డ‌జ‌న్ల గ్రూపులుగా చీలిపోయి…ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నాయి. అలాగే ఎర్ర‌కోట బెంగాల్ ను పోగొట్టుకున్న సీపీఎం త‌ర్వాత త్రిపుర‌లో కూడా అధికారాన్ని కోల్పోయింది. కేర‌ళ‌లో మాత్ర‌మే అరుణ‌తార మినుకు మినుకు మంటూ మెరుస్తోంది. దేశంలో తొలి రైతాంగ సాయుధ‌పోరాటాన్ని నిర్వ‌హించిన తెలుగునాట చ‌ట్ట‌స‌భ‌ల్లో క‌నీసం ప్రాతినిధ్యం కూడా లేకుండా ద‌య‌నీయంగా మారాయి క‌మ్యూనిస్టు పార్టీలు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పార్టీ మ‌హాస‌భ‌లు జ‌రుపుకుంటోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాడుతూ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కూడ‌గ‌ట్టాల‌ని మ‌హాస‌భ‌లో తీర్మానించారు. రాష్ట్రంలో బీజేపీ బ‌ల‌ప‌డ‌కుండాను, టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పైనా ద్విముఖ పోరాటం చేయాల‌ని కూడా నిర్ణ‌యించింది. దేశానికి స్వతంత్రం రాక‌ముందే నిజాంకు వ్య‌తిరేకంగా రైతాంగ సాయుధ పోరాటం చేసి నాలుగు వేల‌మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను బ‌లిచ్చామ‌ని చెప్పుకుంటూ నాలుగు సీట్ల కోసం నిరంత‌రం ఏదో ఒక పార్టీకి తోక‌గా మార‌డంతోనే ఇక్క‌డ అప్ర‌తిష్ట మూట‌క‌ట్టుకున్నారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని వ్య‌తిరేకించారు. కాని ఇస్తే అడ్డు చెప్ప‌బోమ‌న్నారు. రాష్ట్రం వ‌చ్చాక ముందుగా రెండు రాష్ట్రాలకు విడి విడిగా పార్టీ శాఖ‌ల‌ను ఏర్పాటు చేసుకున్న‌ది, పార్టీ ఆస్తుల‌ను, ప‌త్రిక‌ను విభ‌జించుకున్న‌ది సీపీఎం మాత్ర‌మే.

కాంగ్రెస్ లోని తెలంగాణ నేత‌లు ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఏనాటి నుంచో పోరాడుతున్నారు. బీజేపీ తెలంగాణ విభ‌జ‌న‌కు 1996లోనే ఓకే చెప్పింది. అయితే కేంద్రంలోని అధికార పార్టీలు ఇక్క‌డ త‌మ ప్ర‌యోజ‌నాల కోసం తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని విస్మ‌రించాయి. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఢిల్లీలో అధికారంలో ఉన్న‌పుడు చేసింది ఒక్క‌టే. తెలుగుదేశంలో ఉండి ప్ర‌యోజ‌నం లేద‌నుకున్న కేసీఆర్ 2001లో బ‌య‌టికొచ్చి టీఆర్ ఎస్ పార్టీ స్థాపించాక ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం వేడెక్కింది. సీపీఐ కూడా తెలంగాణ‌కు జై కొట్టింది. సీపీఎం మాత్రం ప్ర‌త్యేక రాష్ట్రానికి వ్య‌తిరేకంగానే ప‌నిచేసింది. దీంతో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగి అంత‌కుముందు వ‌చ్చే కొన్ని సీట్లు కూడా లేకుండా క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. బీజేపీని నిక‌రంగా వ్య‌తిరేకించే సీపీఎం కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ ఎస్ పార్టీల‌ విష‌యం వ‌చ్చేస‌రికి ఎప్ప‌టికి ఏది అవ‌స‌ర‌మో అప్పటికి అదే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఒక విధానం అంటూ లేకుండా సాగ‌డంతో తెలంగాణ‌లో పూర్తిగా ఉనికి కోల్పోయింది. మ‌ధ్య‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ రావ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌తో క‌లిసి పోటీ చేద్దామ‌ని అనుకున్నారు. కాని తెలంగాణ‌లో పోటీకే ప‌వ‌న్ ఆస‌క్తి చూపించ‌లేదు. దీంతో సీపీఐ, సీపీఎంలు విడి విడిగా రెండు వేర్వేరు కూట‌ములుగా పోటీ చేసి తెలంగాణ అసెంబ్లీలో ఎవ‌రికీ సీటు లేకుండా చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌లోనూ సీపీఎం విధానాలు, ఎత్తులు స‌క్ర‌మంగా సాగ‌లేదు. పార్టీ ఎంతో కొంత బ‌లంగా ఉన్న ఉమ్మ‌డి ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల్లో కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఒక‌నాటి సీపీఎం నేత నోముల న‌ర్సింహ‌య్య టీఆర్ ఎస్ లో చేరి నాగార్జున‌సాగ‌ర్ లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డిని ఓడించి విజ‌యం సాధించారు. ఆయ‌న మ‌ర‌ణంతో ఉప ఎన్నిక వ‌స్తే బీజేపీని ఓడించ‌డానికికంటూ టీఆర్ఎస్ కు మ‌ద్దిచ్చారు. స్థానిక ఎన్నిక‌ల్లోగాని, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గాని ఒక ప‌ద్ద‌తంటూ లేకుండా కేడ‌ర్ ను అయోమ‌యానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు మ‌ర‌లా బీజేపీ మ‌త త‌త్వ‌, టీఆర్ఎస్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌ట్టి పోరాడాల‌ని మ‌హాస‌భ‌లో తీర్మానించారు. ఎన్నిక‌లొచ్చేవ‌ర‌కు ప్ర‌భుత్వం మీద పోరాడ‌తారు. ఎన్నిక‌లు రాగానే మ‌ళ్లీ బీజేపీకి వ్య‌తిరేకంగా అంటూ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోర‌ని గ్యారెంటీ ఏంట‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. సీపీఎం కేంద్ర క‌మిటీ స‌మావేశాలు కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్ లో జ‌రిగిన‌పుడు కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ వ‌చ్చారు. ఆయ‌న అధికారికంగా తెలంగాణ ముఖ్య‌మంత్రితో మాట్లాడేందుకు అపాయింట్ మెంట్ కోరారు. కేసీఆర్ మొత్తం కేంద్ర క‌మిటీ స‌భ్యులంద‌రినీ విందుకు ఆహ్వానించారు. మొత్తం వెళ్ళ‌లేదు గాని జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరితో స‌హా మ‌రో ముగ్గురు నేత‌లు విందుకు వెళ్లారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి అధికారికంగా ఆయ‌న రాష్ట్రంలో పెట్టుబ‌డుల గురించి చ‌ర్చించుకోవ‌డానికి తెలంగాణ సీఎం ద‌గ్గ‌ర‌కు వెళ్ళాడంటే అర్థం చేసుకోవ‌చ్చు. జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎందుకు వెళ్ళాల్సి వ‌చ్చిందంటే స‌మాధానం ఏం చెబుతారు. బీజేపీయ‌త‌ర‌, కాంగ్రెసేత‌ర ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ ఇటీవ‌ల మ‌రోసారి కేసీఆర్ హ‌డావుడి చేస్తున్నారు. ఆయ‌న ఫ్రంట్ ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో, అధికారంలోకి వ‌చ్చాక కేంద్రం మీద ఆయ‌న చేస్తున్న‌ పోరాటం ఏ రేంజ్ లో ఉందో సీపీఎం నేత‌ల‌కు తెలియ‌దా. సీపీఎం నేత‌లు రాష్ట్రంలో త‌మ‌కున్న సిస‌లైన బ‌లం ఎంత అనేది ఎప్పుడు తెలుసుకుంటారు. తీర్మానాల‌తో స‌రిపెడ‌తారా. కార్య‌రంగంలోకి దిగుతారా? అస‌లు ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీలు మ‌న‌స్ఫూర్తిగా క‌లిసి ప‌నిచేయ‌డం సాధ్య‌మేనా అని కూడా ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.