ధరల మంట సామాన్యుడి కడుపు కాలేలా చేస్తోంది. పెరుగుతున్న నిత్యావసరాలు, ఇతరత్రాల ధరలను చూసి పస్తులుండాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. నెలవారీ బడ్జెట్ లో వంద రూపాయిలు పెరిగితేనే సామాన్యుడు విలవిలలాడిపోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేస్తాడు. అలాంటిది.. ఆయిల్ రేట్లు, పప్పుల ధరలు, కూరగాయల రేట్లు.. అన్నీ భయపెడుతున్నాయి. ఇప్పుడు దీనికి పామాయిల్ రేట్లు కూడా తోడయ్యాయి.
ఇప్పటివరకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చాయనుకుంటే.. ఇప్పుడు ఇండోనేషియా మరో ఝలక్ ఇచ్చింది. స్థానికంగా నెలకొన్న పరిస్థితుల వల్ల పామాయిల్ ఎగుమతులను ఈ నెల 28 నుంచి నిలిపివేస్తున్నామని ఇండోనేషియా ప్రకటించింది. దీంతో వంట నూనెల ధరలు మళ్లీ పెరగబోతున్నాయి. ఇప్పటికే టోకు వ్యాపారులు పామాయిల్ అమ్మకాలను ఆపేశారు. దీంతో వారం కిందట
లీటరు పామాయిల్ ధర రూ.140 ఉంటే.. ఇప్పుడు రూ.150, రేపో, ఎల్లుండో రూ.160 కు పెరిగే ఛాన్సుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే.. తెలంగాణలో ఎక్కువగా వాడే నూనెల్లో.. అంటే మొత్తం వినియోగంలో దాదాపు 60 శాతం పామాయిలే ఉంటుంది. అందుకే వారిపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే లీటరు పెట్రోల్ రేటు దాదాపు రూ.25, డీజిల్ ధర దాదాపుగా రూ.17 మేర పెరిగింది. దీంతో రవాణా వ్యయం పెరిగింది. ఆ ఎఫెక్ట్ మిగిలిన అన్ని వస్తువుల ధరలపైనా పడింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఉల్లిపాయల లారీ లోడుకు అదనంగా రూ.3000-4000 తీసుకుంటున్నారు. ఆటో, క్యాబ్ అద్దెలు కూడా ట్రిప్పుకు రూ.20-40 అదనంగా వసూలు చేస్తున్నారు.
ఏడాది కిందట కందిపప్పు, చనగపప్పు, మినపప్పు.. ఇంకా ఇతర రకాల పప్పులను కేజీ రూ.100-140 వరకు అమ్మేవారు. కానీ ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో రూ.120-160 వరకు అమ్ముతున్నారు. దీనికితోడు మినుముల దిగుబడి తగ్గడంతో ఒక్క సంవత్సరంలోనే మినపగుళ్లు, మినపపప్పు రేటు కేజీకి రూ.20-30 వరకు పెరిగింది. దీంతో ఏం కొనలేక.. తినలేక సామాన్యుడు సతమతమవుతున్నాడు.