Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష బీజేపీని కోరారు.

Rameshwaram Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష బీజేపీని కోరారు. రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు సీఎం సిద్ధరామయ్య బ్రూక్‌ఫీల్డ్‌ ఆస్పత్రికి వెళ్లారు.

రామేశ్వరం కేఫ్‌పై దాడికి బాధ్యులైన వ్యక్తుల్ని గుర్తించేందుకు ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరుగుతోందని చెప్పారు సీఎం సిద్దరామయ్య. మైనారిటీలను మభ్యపెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న బీజేపీ నేతల ఆరోపణపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తన హయాంలో ఇదొక ఘటన మాత్రమేనని కానీ మంగళూరు కుక్కర్‌ బాంబు పేలినప్పుడు బుజ్జగింపులేనా అని ప్రశ్నించారు సీఎం. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని విపక్షాలను కోరిన సిద్ధరామయ్య, సీరియస్ గా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మంగళూరు పేలుడుకు, బెంగళూరు పేలుడుకు ఎటువంటి సంబంధం లేదు. పేలుడు ఇంకా విచారణలో ఉంది అని సిద్ధరామయ్య అన్నారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరోవైపు పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏడెనిమిది బృందాలను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఓ యువకుడు కేఫ్ లో బ్యాగ్‌ను ఉంచి వెళ్ళాడు. కాసేపటికే ఘటన జరిగిందని చెప్పారు డీకే. కాగా ఈ ఘటనలో సుమారు 10 మంది గాయపడ్డారు. మరోవైపు రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వేచ్ఛనివ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.

Also Read: Delhi Police: రామేశ్వరం కేఫ్‌ ఘటన.. దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్‌