Site icon HashtagU Telugu

Delhi : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం ఒమర్‌ అబ్దులా భేటి

CM Omar Abdullah meet Union Home Minister Amit Shah

CM Omar Abdullah meet Union Home Minister Amit Shah

Jammu and Kashmir : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలనే అంశంపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలో అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని అమిత్‌షా హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి చెప్పినట్లు సమాచారం.

కాగా, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగం అందించిన 370 ఆర్టికల్‌ కేంద్రం 2019లో రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర హోదాను తొలగిస్తూ జమ్ము కశ్మీర్, లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఇది జరిగిన అయిదేళ్ల తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్దరించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించే అవకాశం ఉంది. ఇక గత వారం జరిగిన మొదటి కేబినెట్‌ భేటీలో జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అబ్దుల్లా నేడు సాయంత్రం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని ఆ తీర్మానం కాపీని సమర్పించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ 90 స్థానాలకు గాను 42 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సాధించింది. దీంతో పార్టీ నేత ఓమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Read Also: APPSC: ఏపీపీఎస్సీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా మాజీ ఐపీఎస్‌ ఎ.ఆర్ అనురాధ బాధ్య‌త‌ల‌ స్వీక‌రణ‌