Site icon HashtagU Telugu

Nitish Kumar: కాసేపట్లో సీఎం నితీశ్ రాజీనామా.. సాయంత్రం మరోసారి సీఎంగా ప్రమాణం !

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: బిహార్‌లో ఇవాళ బీజేపీతో కలిసి జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమికి గుడ్‌బై చెప్పనున్నారు. ఈక్రమంలోనే ఓ కీలక పరిణామం జరిగింది. తన రాజీనామా లేఖను అందించడానికి సీఎం నితీశ్ కుమార్ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ అపాయింట్‌మెంట్ కోరారు. ఈరోజు ఉదయం 10 గంటలకు జేడీయూ శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. అది ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్తారు.  గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించి.. సాయంత్రం 4 గంటలలోగా ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ, బీజేపీ మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు నితీశ్ అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ ఎన్డీఏ కూటమిని ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం చేస్తారని సమాచారం. బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎం పోస్టులతో పాటు ఒకరికి స్పీకర్ పోస్టు ఇచ్చేందుకు నితీశ్ అంగీకరించారని తెలుస్తోంది. ఆర్జేడీ మంత్రుల పోస్టులన్నీ బీజేపీ నేతలకు నితీశ్(Nitish Kumar) కేటాయించనున్నారట.

We’re now on WhatsApp. Click to Join.

243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 122. జేడీయూకు 45 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామీ లీగ్-4 స్థానాలను కలుపుకొంటే ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోగలుగుతుంది. జేడీయూ, బీజేపీ, ఆవామీ లీగ్‌కు చెందిన 127 మంది సభ్యులు.. నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్ రాష్ట్రం మీదుగా వెళుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర బాధ్యతలను ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్‌కు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది.