CM Kejriwal: లిక్కర్ స్కామ్ చార్జ్‌షీట్‌ లో కేజ్రీవాల్‌ పేరు

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాఖలుచేసిన అదనపు చార్జ్‌షీట్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాంగుట పేర్లు ఇందులో ప్రస్తావించింది ఈడీ.

  • Written By:
  • Updated On - February 3, 2023 / 01:00 PM IST

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Scam)లో మరో సంచలనం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన అదనపు చార్జ్‌షీట్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాంగుట పేర్లు ఇందులో ప్రస్తావించింది ఈడీ. మొత్తం 428 పేజీల చార్జ్‌షీట్‌లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రధారులన్నది సవివరంగా పేర్కొంది. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలుచేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌. ఈ కేసులో ఇప్పటి వరకు సీబీఐ విచారించిన వారి వాంగ్మూలాలు సైతం ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కోంది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు ప్రధానంగా ప్రస్తావించారు.

గతంలో లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు ప్రస్తావించిన ఈడీ ఇప్పుడు ఏకంగా సీఎంకు సంబంధాలున్నాయని తెలిపింది. కేజ్రీవాల్ మనిషిగా విజయ్ నాయర్ మొత్తం వ్యవహారం చక్కబెట్టాడని పేర్కొంది. నాయర్‌ నా మనిషి.. నమ్మొచ్చని వీడియో కాల్‌లో కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించినట్టు కోర్టుకు తెలిపింది. కుంభకోణానికి సంబంధించి వంద కోట్ల ముడుపులు ఆమ్ అద్మీ పార్టీకి చేరాయని ఆరోపించింది. ముడుపుల రూపంలో అందిన ఈ 100కోట్లను గోవా ఎన్నికల్లో ఆమ్ అద్మీ పార్టీ ఉపయోగించిందని చార్జ్‌షీట్‌లో పేర్కొంది ఈడీ. గోవాలో పార్టీ వాలంటీర్లుగా పనిచేసినవారి కోసం ఈ డబ్బు ఖర్చు చేసినట్టు తెలిపింది.ఈడీ చార్జిషీట్‌ను తప్పుల తడకగా కొట్టిపారేశారు కేజ్రీవాల్. గత ఎనిమిదేళ్లలో ఈడీ దాదాపు 5వేల చార్జిషీట్లు వేసిందని అయితే ఒక్క కేసులోనూ ఎవరికి శిక్ష పడలేదన్నారు. లిక్కర్ స్కామ్‌ పాలసీ కుట్ర గురించి చార్జ్‌షీట్‌లో వివరించిన ఈడీ.. మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది.

Also Read: Modi: మోదీ విదేశీ ఖర్చు ఎంతో తెలుసా?.. షాక్ ఇస్తున్న లెక్కలు!

గతేడాది నవంబర్ 12న అరుణ్‌ పిళ్లైను విచారించినప్పుడు కవిత గురించి తెలిసిందని పేర్కొంది. అరుణ్ పిళ్లై.. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఇండో స్పిరిట్స్‌ పార్ట్‌నర్‌గా చేరారని వివరించింది. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ కవితతో కలిసి వెళ్లానని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పిళ్లై స్పష్టంగా పేర్కోన్నారు. ఈ సమావేశంలోనే 100కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చే విషయంలో కవితకు ఆప్ నేతలకు మధ్య ఒప్పందం కుదిరిందని విచారణలో ఒప్పుకున్నారు అరుణ్‌ పిళ్లై. ఈ సమయంలో కవిత వాడిన రెండు ఫోన్ నెంబర్లను చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది ఈడీ. ఈ నెంబర్లను ఏ ఏ సమయంలో వాడారో కూడా తేదీల వారీగా వివరించింది. ఈ మొబైల్స్‌ను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేర్లలో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌.

ఇక లిక్కర్ స్కాంలో ఎంపీ మాగుంట పేరు కూడా ఈడీ చార్జ్‌షీట్‌లో ఉంది. ఒబెరాయ్ హోటల్లో కుట్రకు సంబంధించిన వ్యవహారమంతా జరిగిందని తెలిపింది. ఆమ్ అద్మీ పార్టీతో కవితకు పూర్తి సమన్వయం ఉందని, ఢిల్లీలో మద్యం షాపులకు ముఖ్యంగా L1 షాపులను దక్కించుకునేలా పావులు కదిపారని ఈడీ తెలిపింది. కవిత ప్రత్యేక విమానంలో పలు మార్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చారని చార్జిషీట్‌లో పేర్కొంది ఈడీ. లంచం ఇచ్చే వ్యవహారాన్ని కవిత పర్యవేక్షించి పనిపూర్తయ్యేలా చేశారని ఆరోపించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఈడీ దాఖలుచేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నిందితులకు నోటీసులు జారీచేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.