Bangladesh Crisis : బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నేలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సర్వీసుల్లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా గత నెలలో మొదలైన నిరసనలు ఇటీవల హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడం, దేశం విడిచిపెట్టి వెళ్లిపోవడం జరిగిపోయాయి. అలా ఆమె దేశం విడిచిపెట్టినా.. ఇంకా అక్కడ ఆగ్రహజ్వాలలు ఆరడం లేదు. నిసరనకారులు భారీ మొత్తంలో ప్రభుత్వ, మైనారిటీల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో రాజధాని ఢాకా రణరంగాన్ని తలపిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అశాంతి, భారీ నిరసనల మధ్య బంగ్లాదేశ్లోని అన్ని భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలు నిరవధికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకూ అన్ని సెంటర్లూ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు భారత వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్లో మెసేజ్ పెట్టారు.
మరోవైపు ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో.. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొలువదీరనుంది.