Mosque Survey : ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ నగరం ఇవాళ ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నగరంలోని షాహీ జామా మసీదును ప్రాచీన హిందూ దేవాలయంపై నిర్మించారంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన స్థానిక కోర్టు.. దాన్ని సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్వే చేసేందుకు ఇవాళ ఉదయాన్నే అధికారులు మసీదు వద్దకు చేరుకున్నారు. కోర్టు ఆర్డర్స్‌ను మసీదు నిర్వాహకులకు చూపించారు. అయితే మసీదును సర్వే చేసేందుకు అనుమతించేది లేదని ముస్లిం వర్గానికి చెందిన వారు తేల్చి చెప్పారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సి ఉంటుందని అధికారులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఓ వర్గం ప్రజలు వందలాదిగా రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగారు. ఈక్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో ఆ వర్గంలోని పలువురు యువకులు రాళ్లను పోలీసులపైకి విసిరారు. ఉద్రిక్తత పెరగడంతో.. మరింత మంది పోలీసు బలగాలను అక్కడికి పంపించారు. రాళ్ల దాడి చేస్తున్న వారు, నిరసనకారులను అక్కడి నుంచి వెనక్కి పంపేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను(Mosque Survey) ప్రయోగించారు. వాస్తవానికి ఈ మసీదును నవంబరు 19న కూడా మసీదు కమిటీ నిర్వాహకుల సమక్షంలో అధికారులు సర్వే చేసినట్లు తెలిసింది. ఇప్పుడు మరోసారి సర్వేకు వెళ్లడంతో అందుకు మసీదు కమిటీ నిర్వాహకులు సహకరించలేదని సమాచారం.
Also Read :Air Quality Today : ఇవాళ కాలుష్యమయ నగరాల్లో నంబర్ 1 ఢిల్లీ.. హైదరాబాద్ ర్యాంకు ఇదీ
ఫిర్యాదులో ఏముంది ?
ప్రాచీన విష్ణువు ఆలయంపై ఈ మసీదును నిర్మించారంటూ హరిశంకర్ జైన్ అనే సీనియర్ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) 1879లో రూపొందించిన ఒక నివేదికను ఉటంకిస్తూ.. సంభల్‌లోని షాహీ జామా మసీదు స్తంభాలు, నిర్మాణ శైలి హిందూ దేవాలయాల లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పారు. మసీదు స్తంభాలు ప్లాస్టరింగ్‌తో ఉన్నాయని, మసీదు గోపురం కింద ఉన్న నిర్మాణాలు సైతం పురాతన హిందూ దేవాలయంలా ఉన్నాయని ఆ నివేదికలో ఉందని హరిశంకర్ జైన్ తెలిపారు. మీర్ హిందూ బేగ్ అనే బాబర్ సభికుడు ఈ ఆలయాన్ని మసీదుగా మార్చాడని బాబర్ నామా, తారీఖ్-ఎ-బాబ్రీ వంటి చారిత్రక గ్రంథాలలో ప్రస్తావన ఉందని సదరు న్యాయవాది ఆరోపించారు. బాబర్ నామా గ్రంథపు ఆంగ్ల అనువాదంలో ఈ వివరాలు ఉన్నాయన్నారు.
ముస్లిం పక్షం ఏమంటోంది ?
న్యాయవాది హరిశంకర్ జైన్ వాదనను ముస్లిం పక్షం పూర్తిగా తోసిపుచ్చింది. మసీదుకు ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కోర్టు జారీ చేసిన సర్వే ఉత్తర్వు అసాధారణమైనదిగా ఉందని జామా మసీదు అధ్యక్షుడు మహ్మద్ జాఫర్ అన్నారు. ఆ ఉత్తర్వు పక్షపాత వైఖరితో ఉందని చెప్పారు. మసీదులో హిందూ దేవాలయం ఉన్న ఆనవాళ్లు లేవని తేల్చి చెప్పారు.