Site icon HashtagU Telugu

Delhi : ఢిల్లీలో ఏబీవీపీ, జేఎన్‌యూ స్టూడెంట్ యూనియ‌న్స్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

Jnu

Jnu

ఢిల్లీలో ఏబీవీపీ, జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వామపక్షాల నియంత్రణలో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ ఏబీవీపీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఐఐటి బాంబే విద్యార్థి మృతిపై న్యాయం చేయాలని కోరుతూ జరిగిన మార్చ్ తర్వాత కొంతమంది విద్యార్థులపై ఏబీవీపీ దాడి చేసిందని జెఎన్‌యుఎస్‌యు ఆరోపించగా.. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అవమానించారని ఏబీవీపీ ..వామపక్ష మద్దతు గల విద్యార్థి సంఘాలను ఆరోపించింది. బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న దర్శన్‌ సోలంకి మృతి పట్ల జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఆదివారం క్యాండిల్‌ మార్చ్‌ నిర్వహించింది. ఐఐటీలోని పోవై క్యాంపస్‌లోని హాస్టల్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి దర్శన్ సోలంకి (18) మృతి చెందాడు.

షెడ్యూల్డ్ కులాల కమ్యూనిటీకి చెందినందుకు అతను ఐఐటీ బాంబేలో వివక్షను ఎదుర్కొన్నాడని సోలంకి కుటుంబం ఆరోపించింది. జేఎన్‌యూఎస్‌యూ ఒక ప్రకటనలో ఏబీవీపీ మరోసారి విద్యార్థులపై దాడికి దిగిందని.. దర్శన్ సోలంకి తండ్రి పిలుపుకు సంఘీభావంగా క్యాండిల్‌లైట్ మార్చ్ చేసిన వెంటనే ఇది జరిగిందని పేర్కొంది. అయితే ABVP ఈ ఆరోపణను ఖండించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రానికి ఉన్న దండను వామ‌ప‌క్ష విద్యార్థి సంఘం నేత‌లు తీసి విసిరేశార‌ని ఏబీవీపీ ఆరోపించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏబీవీపీ విద్యార్థి సంఘం తెలిపింది.