Journalists Lands : `సీజేఐ`సంచ‌ల‌న‌ తీర్పు, జ‌ర్న‌లిస్ట్ ల హ‌ర్షం-మంత్రి కేటీఆర్ అభినంద‌న‌

ప‌దిహేనేళ్లుగా పెండింగ్ లో ఉన్న జ‌ర్న‌లిస్ట్ ఇళ్ల స్థ‌లాల వివాదంపై సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న తీర్పును ప్ర‌క‌టించారు. ప‌దవీ విర‌మ‌ణ‌కు ఒక రోజు ముందుగా ఆయ‌న ఇచ్చిన ఈ తీర్పు వేలాది మంది తెలుగు జ‌ర్న‌లిస్ట్ ల‌కు ఊర‌ట‌నిచ్చింది

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 02:44 PM IST

ప‌దిహేనేళ్లుగా పెండింగ్ లో ఉన్న జ‌ర్న‌లిస్ట్ ఇళ్ల స్థ‌లాల వివాదంపై సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న తీర్పును ప్ర‌క‌టించారు. ప‌దవీ విర‌మ‌ణ‌కు ఒక రోజు ముందుగా ఆయ‌న ఇచ్చిన ఈ తీర్పు వేలాది మంది తెలుగు జ‌ర్న‌లిస్ట్ ల‌కు ఊర‌ట‌నిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. హైదరాబాదులోని జ‌ర్న‌లిస్టు సొసైటీ ఇళ్ల స్థలాలకు సంబంధించిన పెండింగ్ ఫైల్ కు 15 ఏళ్ల త‌రువాత మోక్షం క‌లిగించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణాలకు అనుమ‌తి ఇస్తూ కీల‌క తీర్పు ప్ర‌క‌టించారు.

ప్ర‌జాప్ర‌తినిధులు , బ్యూరోక్రాట్లకు ఇళ్ల స్థలాల వ్యవహారంతో పాత్రికేయుల ఇళ్ల స్థలాల వ్యవహారం ముడిపెట్టరాదని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తాను వ్యాఖ్యలు చేయడంలేదని, కానీ ఓ చిరు పాత్రికేయుడు ఎందుకు ఇబ్బంది పడాలి? అని సూటిగా ప్రశ్నిస్తూ మాన‌వీయ కోణం నుంచి తీర్పు ను వెలువ‌రించారు. సుమారు 8 వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు ఇస్తున్నాన‌ని సీజేఐ వెల్ల‌డించారు. జర్నలిస్టులకు భూమి కేటాయించినా అభివృద్ధి చేయలేదని, జర్నలిస్టులంతా కలిసి ఆ భూమి కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్ చేశారని, ఆ స్థలాన్ని జర్నలిస్టులు స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తూ సంచ‌ల‌న తీర్పు ప్ర‌క‌టించారు. ఆ స్థలంలో పాత్రికేయులు నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చని శుభవార్త చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్, ప్రజాప్రతినిధులకు ఇళ్ల స్థలాల వ్యవహారాన్ని మరో బెంచ్ ముందు విచారణకు తీసుకువస్తామని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

మాన‌వీయ కోణంలో ఆలోచించి ఇచ్చిన ఈ తీర్పుపై పాత్రికేయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం వెలువరించిన తీర్పును ఆనందోత్సాహాలతో స్వాగతించారు. అటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ తీర్పుపై స్పందించారు. తెలంగాణ జర్నలిస్టు సొసైటీ ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి సుదీర్ఘకాలంగా విచారణలో ఉన్న ఈ కేసును పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ తీర్పు వల్ల, పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వీలు కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ స‌ర్కార్ సుప్రీం తీర్పు ప్ర‌కారం జ‌ర్న‌లిస్ట్ ల‌కు స్థలాల‌ను కేటాయిస్తామ‌ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించ‌డం శుభ‌ప‌రిణామం.