భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు (Tensions between India and Pakistan) కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్(Civil Mock Drill)లు నిర్వహించాలని ఆదేశించింది. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని, మే 7, 2025న ఈ డ్రిల్‌లు నిర్వహించాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సత్వర స్పందన కోసం ప్రజలు, వ్యవస్థలు, అధికారులు కలసి పనిచేసే విధానాన్ని పరీక్షించేందుకు ఇది ముఖ్యమైన చర్యగా చెబుతున్నారు.
సివిల్ మాక్ డ్రిల్ అంటే పౌర రక్షణ లేదా విపత్తు నిర్వహణలో భాగంగా చేపట్టే ప్రాక్టీస్. భూకంపం, వరదలు, ఉగ్రవాద దాడులు, రసాయన లీకేజీలు వంటి విపత్తులపై ఎలా స్పందించాలో ఈ డ్రిల్‌ల ద్వారా చూపించబడుతుంది. ఇందులో పోలీసులు, అగ్నిమాపక శాఖ, వైద్య సిబ్బంది, NDRF, SDRF బృందాలు, స్థానిక పాలనా వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు పౌరులు కూడా పాల్గొంటారు. ప్రజలలో అవగాహన కల్పించడం, లోపాలను గుర్తించి సరిదిద్దడం ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యాలు.
Earthquake : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం..పరుగులు తీసిన ప్రజలు
ఇప్పటికే జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల నేపధ్యంలో ఈ డ్రిల్‌లు నిర్వహించారు. ప్రత్యేకించి పహల్గామ్ ప్రాంతంలో డ్రిల్‌లు చేపట్టారు. ఢిల్లీ, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ NDMA ఆధ్వర్యంలో మెగా మాక్ డ్రిల్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం దేశవ్యాప్తంగా ఈ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశించడంతో, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రజల్లో విపత్తులపై సన్నద్ధత పెంచడానికి ఈ చర్య కీలకంగా మారనుంది.