China Vs India : భారత్‌తో సరిహద్దు వివాదానికి తాత్కాలిక పరిష్కారం లభించినట్టే అని చైనా వెల్లడించింది. సైనిక, దౌత్య మార్గాల ద్వారా ఇరుదేశాల మధ్య నెలల తరబడి జరిగిన చర్చల్లో సానుకూల ఫలితం వచ్చిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఇవాళ తెలిపారు. చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన వివాదాస్పద అంశాలకు ఇరుపక్షాలు కలిసికట్టుగా పరిష్కారాన్ని కనుగొనగలిగాయని ఆయన చెప్పారు. తదుపరి దశలో ఈ పరిష్కార మార్గాలను క్షేత్రస్థాయిలో అమలుపరిచే విషయంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధమన్నారు. ఈ అంశాన్ని సోమవారం రోజే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. సరిహద్దు(China Vs India) వివాదానికి తాత్కాలిక పరిష్కారం లభించినట్టేనని పేర్కొంది. 2020 సంవత్సరం ఏప్రిల్‌కు మునుపటి పొజిషనింగ్‌లోకి ఇరుదేశాల సైనిక బలగాలను వెనక్కి పిలుచుకోవాలని చైనా-భారత్‌లు అంగీకారానికి వచ్చాయని వెల్లడించింది.
Also Read :YouTube Premium Lite: ‘యూట్యూబ్ ప్రీమియం లైట్’ వస్తోంది.. సబ్‌స్క్రిప్షన్ రేటు, ఫీచర్లు ఇవీ
ఈ అంశంపై ఇవాళ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన చేశారు. సరిహద్దుల్లో 2020 ఏప్రిల్‌కు మునుపటి పొజిషనింగ్‌లోకి చైనా ఆర్మీ వెళితేనే.. భారత బలగాలను వెనక్కి రప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. చైనాతో సరిహద్దుల్లో విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బఫర్‌జోన్‌లోకి ప్రవేశించబోమని చైనా, భారత్‌లు పరస్పరం భరోసా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, భారత్-చైనాల మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి కొనసాగుతుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఈరోజు నుంచి ఈనెల 24 వరకు రష్యాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించే ఛాన్స్ ఉంది. అమెరికా, కెనడాలు ఖలిస్తానీ తీవ్రవాదులకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న ప్రస్తుత తరుణంలో భారత్-చైనాల మధ్య సరిహద్దు సమస్య తాత్కాలికంగా పరిష్కారం కావడం గమనార్హం.