Chilkapalli : చిల్కపల్లి.. ఇదొక మారుమూల పల్లె. మన దేశానికి స్వాతంత్య్రం 1947లో వచ్చింది. అయితే ఈ పల్లెలో విద్యుత్ వెలుగులు మాత్రం ఈ సంవత్సరం జనవరి 23 నుంచే వస్తున్నాయి. అంటే విద్యుత్ వెలుగుల కోసం ఈ ఊరు దాదాపు 77 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇంతకీ ఈ ఊరు ఎక్కడ ఉంది.. అనుకుంటున్నారా ? ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో చిల్కపల్లి గ్రామం ఉంది. జిల్లా కేంద్రానికి 50 కి.మీ దూరంలో ఈ ఊరు ఉంటుంది.
Also Read :Phone Tapping Case : ఫోన్‌ట్యాపింగ్ కేసులో తొలి బెయిల్.. 10 నెలలుగా జైలులో ఉన్న తిరుపతన్నకు ఊరట
‘నియాద్ నెల్లనార్ యోజన’
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని దశాబ్దాల తరబడి ఏలిన పార్టీలు ఈ ఊరిని విస్మరించాయి. ఇలాంటి మరెన్నో మారుమూల ఊళ్లను పట్టించుకోలేదు. అవి కారు చీకటిలో మగ్గుతున్నా ఊసెత్తి చూడలేదు. చివరకు రాష్ట్రంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ‘నియాద్ నెల్లనార్ యోజన’ అనే పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిలో భాగంగా చీకట్లో మగ్గుతున్న మారుమూల పల్లెల్లో విద్యుద్దీకరణ పనులను నిర్వహించింది. ఈ స్కీం ద్వారానే చిల్కపల్లి గ్రామంలో(Chilkapalli) విద్యుద్దీకరణ పనులు జరిగాయి.
Also Read :Mohammed Siraj Dating: బాలీవుడ్ సింగర్‌తో సిరాజ్ డేటింగ్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..!
రోడ్డు అధ్వానంగా ఉండటంతో..
అయితే ఈ పనులు అంత ఆషామాషీగా పూర్తి కాలేదు. ఎందుకంటే ఈ ఊరికి రోడ్డు సరిగ్గా ఉండదు. గతంలో చిల్కపల్లిపై మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. అందువల్ల బీజాపూర్ జిల్లా కేంద్రం నుంచి ఈ గ్రామానికి రోడ్డు సరిగ్గా ఉండేది కాదు. అలాంటి అధ్వానమైన మార్గం మీదుగా చిల్కపల్లి వరకు విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాలు, ఇతరత్రా సామగ్రిని తరలించడం పెద్ద సవాలుగా మారింది. అయినా బీజాపూర్ జిల్లా విద్యుత్ విభాగం సిబ్బంది దాదాపు మూడు, నాలుగు నెలల పాటు శ్రమించి ఈ ఊరిలో విద్యుద్దీకరణ పనులను జనవరి 23న పూర్తి చేశారు. ఆ రోజు నుంచే చిల్కపల్లిలో ఇంటింటా విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. విద్యుత్‌తోనూ అక్కడి మహిళలు వంటలు వండగలుగుతున్నారు. చిల్కపల్లిలోని పిల్లలు రాత్రిటైంలోనూ ఇంట్లో చదువుకోగలుగుతున్నారు. ఈ మార్పుపై బీజాపూర్ జిల్లా కలెక్టర్ సంబిత్ మిశ్రా హర్షం వెలిబుచ్చారు. రాబోయే కొన్ని నెలల్లో జిల్లాలోని మరిన్ని మారుమూల గ్రామాల్లోనూ విద్యుద్దీకరణ పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.