Supreme Court : ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు) ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. పదవీ విరమణ పొందిన జ్యుడీషియల్ అధికారులకు రెండో నేషనల్ జ్యుడీషియల్ పే కమిషన్ (ఎస్ఎన్ జేపీసీ) సిఫార్సుల మేరకు పింఛను బకాయిలు, ఇతర ప్రయోజనాలను కల్పించడంలో కొన్ని రాష్ట్రాలు, యూటీలు అలసత్వాన్ని ప్రదర్శించాయి. ఇటీవలే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు(Supreme Court), తమ ఎదుట హాజరుకావాలని వారిని ఆదేశించింది. దీంతో వారంతా ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం ముందు హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
ఎస్ఎన్జేపీసీ సిఫార్సుల అమలుకు సమ్మతిస్తున్నామని తెలుపుతూ మధ్యప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, బెంగాల్, బిహార్, ఒడిశా, కేరళ, ఢిల్లీ సహా కేంద్రపాలిత ప్రాంతాలు కోర్టుకు అఫిడవిట్లను సమర్పించాయి. వీటిని పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఎస్ఎన్జేపీసీ సిఫార్సులను అంగీకరిస్తున్నట్లు అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్రాలు ఇకపై విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులను కోర్టుకు పిలవడంలో తమకు ఎలాంటి ఆనందం లేదని తేల్చి చెప్పింది. కానీ విచారణ సమయంలో రాష్ట్రాల తరఫున న్యాయవాదులు నిరంతరం గైర్హాజరవుతున్నారని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది.
దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెండో నేషనల్ జ్యుడీషియల్ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయడం లేదంటూ కోర్టు సహాయకునిగా (అమికస్ క్యూరీ) వ్యవహరిస్తున్న న్యాయవాది కె.పరమేశ్వర్ ఇటీవలే సుప్రీంకోర్టుకు తెలిపారు.అనేక ఆదేశాలు ఇచ్చినా ఆ 18 రాష్ట్రాలు/యూటీల వైఖరి మారడం లేదన్నారు. దీనిపై కొన్నాళ్ల క్రితం ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లకు బదులు ఇచ్చేందుకే ఇవాళ 18 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‌లు సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు.