NV Ramana : స్థానిక భాష‌ల్లో ‘న్యాయం’

దేశ వ్యాప్తంగా శాస‌న‌, నిర్వ‌హ‌ణ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న సంఘ‌ర్ష‌ణ‌కు తెర‌దింపేలా రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు జ‌డ్జిల స‌ద‌స్సు జ‌రిగింది. ఆ స‌ద‌స్సుకు ముఖ్య అతిథులుగా సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ హాజ‌ర‌య్యారు.

  • Written By:
  • Updated On - April 30, 2022 / 05:15 PM IST

దేశ వ్యాప్తంగా శాస‌న‌, నిర్వ‌హ‌ణ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న సంఘ‌ర్ష‌ణ‌కు తెర‌దింపేలా రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు జ‌డ్జిల స‌ద‌స్సు జ‌రిగింది. ఆ స‌ద‌స్సుకు ముఖ్య అతిథులుగా సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ హాజ‌ర‌య్యారు. మూడు వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య నెల‌కొన్ని సున్నిత‌మైన స‌మస్య‌ల‌తో పాటు మెరుగైన సేవ‌లు అందించ‌డానికి అనువైన ప‌రిస్థితుల‌పై మోడీ, ఎన్వీ సూచించారు. కొన్ని ప్ర‌భుత్వాలు కోర్టు తీర్పుల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ఏపీ త‌ర‌హా ప్ర‌భుత్వాల‌ను ఎన్వీ ప‌రోక్షంగా త‌ప్పుబ‌ట్టారు. స్థానిక భాష‌లను న్యాయ వ్య‌వ‌స్థ‌కు అన్వ‌యించాల‌ని స‌ద‌స్సు తీర్మానం చేసింది. అలాగే, పాత‌కాల‌పు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు తెలియ‌చేస్తూ మ‌రో తీర్మానం చేయ‌డం జ‌రిగింది.

శాస‌న‌, నిర్వ‌హ‌ణ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ల‌క్ష్మ‌ణ‌రేఖ‌ను రాజ్యాంగం గీసిన విష‌యాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వివ‌రించారు. ఆ ‘లక్ష్మణ రేఖ’ను గుర్తుంచుకుని ప‌నిచేయాల‌ని సూచించారు. మూడు వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య‌ సామరస్యపూర్వక పనితీరు మాత్ర‌మే ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంద‌ని చెప్పారు.

గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాసన సభ పరిశీలన గురించి తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శాసనసభలో తాను జోక్యం చేసుకోదలచుకోలేదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. కానీ లోక్‌సభ స్పీకర్ వ్యాఖ్యను ఉపయోగించి చట్టాలను ఆమోదించే ముందు సరైన శాసన పరిశీలన అవసరాన్ని ఎన్వీ ర‌మ‌ణ పునరుద్ఘాటించారు.

ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయ‌ని ఎన్వీ ర‌మ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు. పిల్ కాస్తా ఇప్పుడు “వ్యక్తిగత ఆసక్తి వ్యాజ్యం”గా మారాయ‌ని ఆవేద‌న చెందారు. ఆ విష‌యంలో కోర్టులు జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు. న్యాయపరమైన తీర్పులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా వాటిని ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి మంచిది కాదని అన్నారు. హిందీ, దేశంలోని భాషా వైవిధ్యం గురించి చర్చల మధ్య న్యాయవ్యవస్థలో స్థానిక భాషలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

న్యాయ‌స్థానాల్లో స్థానిక భాష‌ల‌ను ఉప‌యోగించాల‌ని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు జ‌డ్జిల స‌ద‌స్సుల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ సూచించారు. న్యాయ‌ వ్యవస్థపై సాధారణ పౌరులకు విశ్వాసాన్ని, అనుబంధాన్ని స్థానిక భాష పెంచుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

న్యాయాన్ని సులభతరం చేసేందుకు కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని విజ్ఞ‌ప్తి చేశారు. 2015లో అసంబద్ధంగా ఉన్న సుమారు 1800 చట్టాలను గుర్తించామని, వాటిలో 1450 చట్టాలను కేంద్ర రద్దు చేసింద‌ని గుర్తు చేశారు. కానీ రాష్ట్రాలు 75 చట్టాలను మాత్రమే రద్దు చేశాయని మోడీ వివ‌రించారు.

భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో న్యాయం సులువుగా త్వరితగతిన అందరికీ అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. శాస‌న‌, నిర్వ‌హ‌ణ సంయుక్తంగా సమర్థవంతమైన, సమయానుకూలమైన న్యాయ వ్యవస్థ కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తుందని మోడీ వెల్ల‌డించారు.