Site icon HashtagU Telugu

Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో రైతే రాజు

Chhattisgarh Polls

Chhattisgarh Polls

డా. ప్రసాదమూర్తి

Chhattisgarh : ఎన్నికల్లో ఒక్కోచోట నాయకులు ఒక్కోమంత్రం పఠిస్తారు. ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లో ఇప్పటికే ఈడీని రంగంలోకి దింపి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) ని దొడ్డి దారిలో ఓడించడానికి బిజెపి (BJP) సకల ప్రయత్నాలూ చేస్తోంది. బిజెపికి ఇక ఎన్నికల్లో పోరాడటానికి మరో అంశం ఏదీ దొరకలేదని, ఈడీ సహాయం తీసుకుంటోందని ముఖ్యమంత్రి భూపేష్, ఇతర కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది ఎలా ఉన్నా ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లో మాత్రం రైతును సంతోషపెట్టిన వాడే రాజు కాగలడని ఇటీవల వెల్లడైన ఒక సర్వే (Chhattisgarh Polling Survey) ద్వారా అర్థమవుతుంది. ఒక వైపు ఈడీ యుద్ధం జరుగుతుండగానే, మరోవైపు నాయకులు ప్యాడీ యుద్ధం మొదలుపెట్టారు. వరి పంటలో చత్తీస్గడ్ నా అన్నపూర్ణగా భావిస్తారు. ఆ రాష్ట్రంలో రైతులు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర ఏ పార్టీ అందిస్తుందో ఆ పార్టీకి రైతుల మద్దతు లభిస్తుంది. అదే ఎన్నికల్లో కీలకంగా మారుతుంది. 15 సంవత్సరాల బిజెపి పరిపాలనకు చరమగీతం పాడిన అంశం ధాన్యం ధరే అని అక్కడ రైతులు చెబుతున్న మాటల ద్వారా అర్థమవుతుంది. గత ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రభుత్వం రైతులకు చేసిన వాగ్దానం అమలు చేయకపోవడమే కారణమని ఒక వార్తా సంస్థ జరిపిన సర్వే ద్వారా తెలుస్తోంది. తమ పంటకు సరైన గిట్టుబాటు ధర ఎవరు ఇస్తారో వారికే తమ ఓటు అని రైతులు బహిరంగంగానే చెప్తున్నారట.

We’re now on WhatsApp. Click to Join.

రైతులను ఆకట్టుకునే విషయంలో కాంగ్రెస్ ప్రస్తుతానికి ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే క్వింటాలుకు 600 రూపాయలు అధికంగా తాము ఇస్తామని కాంగ్రెస్ 2018 ఎన్నికలలో వాగ్దానం చేసింది. అధికారంలోకి రాగానే నిలబెట్టుకుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే వాగ్దానం చేస్తోంది. చూస్తుంటే రైతులు పండించే ధాన్యం ధర మీదే ఎన్నికల పోరాటం సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ దూకుడు పసిగట్టిన బిజెపి కాంగ్రెస్ ప్రకటించిన ధర కంటే 500 రూపాయలు అధికంగా క్వింటాల్కు 3,100 చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఎకరానికి 20 క్వింటాళ్ల చొప్పున తాము కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ చెప్తే, ఎకరానికి 21 క్వింటాళ్లు ధాన్యాన్ని ఖరీదు చేస్తామని బిజెపి చెబుతోంది. కానీ రైతులు బిజెపి మాటలు నమ్మడం లేదు. కారణం 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి రైతులకు చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేకపోయింది.

క్వింటాలు ధాన్యానికి అధికంగా 300 రూపాయలను బిజెపి ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసింది. కానీ ఆ వాగ్దానాన్ని రెండేళ్లు మాత్రమే నిలబెట్టుకొని తర్వాత ఆపివేసింది. ధాన్యం మద్దతు ధర మీద ఎలాంటి బోనస్ ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాల మేరకు రమణ్ సింగ్ ప్రభుత్వం తమ వాగ్దానాన్ని తామే భంగపరుచుకున్నది. కేంద్రం ఆదేశాలు ఎలా ఉన్నా ఈ విషయంలో రైతులు తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రకటించారు. రమణ్ సింగ్ తమను మోసం చేసినట్టు రైతులు భావించారు. తమకు ఎన్నికల్లో వాగ్దానం చేసిన ధరను రెండేళ్లకే ఆపుజేసి మోసం చేశారని బిజెపి నాయకుల పట్ల ముఖ్యంగా రమణ్ సింగ్ పట్ల తమకు నమ్మకం లేదని అక్కడ రైతులు చెబుతున్నట్టుగా ఈ సర్వే ద్వారా అర్థమవుతుంది.

జరిగిన తప్పిదాన్ని అర్థం చేసుకొని, ఆ పొరపాటున భర్తీ చేసుకోవడానికి రమణ్ సింగ్ మీద రైతులు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి బిజెపి నాయకులు ఆ రాష్ట్రంలో మోడీ మంత్రాన్ని జపిస్తున్నారు. ధాన్యానికి అధిక ధరను ఇవ్వడంలో మోడీ భరోసా ఇస్తున్నారని బిజెపి నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. మోడీ మాటమీద తమకు నమ్మకం ఉన్నా, ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపే బిజెపి నాయకుల మీద తమకు నమ్మకం లేదని అక్కడ రైతులు బహిరంగంగానే అంటున్నారట. రైతుల ధాన్యానికి అధిక ధరను వాగ్దానం చేయడంతో, పాటు రైతుల రుణమాఫీని కూడా కాంగ్రెస్ ఎన్నికలలో అదనంగా ప్రకటించింది. గతంలో రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ మాట నిలబెట్టుకుని ఈసారి కూడా కాంగ్రెస్ ఆ పని చేస్తుందన్న నమ్మకం ఉందని రైతులు విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఏది ఎలా ఉన్నా ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) బిజెపి వారి ఈడీ మంత్రం పెద్ద ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. కానీ బిజెపికి కాంగ్రెస్ కి మధ్య జరుగుతున్న ప్యాడీ వార్ పట్ల మాత్రం రైతులు చాలా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి రైతుల కాయ కష్టానికి సరైన ధర అందించేవాడే చత్తీస్ గఢ్ లో దొర కాగలడని గత అనుభవం చెబుతోంది. ఇప్పుడు ఆ అనుభవం పునరావృతం అవుతుందా లేదా చూడాలి.

Read Also : Thati Venkateswarlu : బిఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు..?

Exit mobile version