Site icon HashtagU Telugu

Polls Today : ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో మొదలైన ఓట్ల పండుగ

Polls Today

Polls Today

Polls Today : ఛత్తీస్‌గఢ్‌లో తొలివిడత పోలింగ్ ప్రక్రియ మొదలైంది. నక్సల్స్ ప్రభావిత  20 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. మొత్తం 5,304 పోలింగ్ స్టేషన్లలో 40 లక్షల మంది తమ ఓటుహక్కును ఈరోజు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. నక్సల్స్ ఎఫెక్ట్ ఎక్కువగా 20 స్థానాలకు తొలి విడతగా ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. బస్తర్, దంతేవాడ, కంకేర్, కవర్ధా, రాజ్‌నంద్‌గావ్ జిల్లాల్లోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. మిగతా పదిచోట్ల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పోలింగ్‌ను రెండు గంటల ముందే ముగించనున్నారు. బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్, నారాయణపూర్, అంతగఢ్, దంతేవాడ, కొంటా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 149 పోలింగ్ కేంద్రాలను భద్రతా కారణాల దృష్ట్యా సమీపంలోని పోలీసు స్టేషన్లు, కేంద్ర బలగాల క్యాంపుల వద్ద(Polls Today)  ఏర్పాటు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

నక్సల్స్ ప్రభావం అత్యధికంగా ఉన్న బస్తర్ డివిజన్‌లో 600కుపైగా పోలింగ్ బూత్‌లు ఉండగా, వీటి పహారా కోసం 60వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 40వేల మంది కేంద్ర సాయుధ బలగాలు, 20వేల మంది రాష్ట్ర పోలీసులు ఉన్నారు. ఇవాళ పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో పోటీ చేస్తున్న కీలక బీజేపీ అభ్యర్థులలో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, భావా బోహ్రా, లతా ఉసెండి, గౌతమ్ ఉకే ఉన్నారు.  కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలలో  మహ్మద్ అక్బర్, సావిత్రి మనోజ్ మాండవి, రాష్ట్ర శాఖ మాజీ చీఫ్ మోహన్ మార్కం, విక్రమ్ మాండవి, కవాసీ లఖ్మా ఉన్నారు. 2018లో జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ పోల్స్‌లో ఈ 20 సీట్లలో 17 కాంగ్రెస్ గెల్చుకుంది.

Also Read: Steve Smith: ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్.. వర్టిగోతో బాధపడుతున్న స్టీవ్ స్మిత్..!

మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పోలింగ్ మొదలైంది. మొత్తం 1276 పోలింగ్‌ కేంద్రాలలో 8.52 లక్షల మందికిపైగా ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడి పోలింగ్ బూత్‌లలో 30 సమస్యాత్మకమైనవి. రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తు కోసం 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 174 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.   2018లో జరిగిన మిజోరం అసెంబ్లీ పోల్స్‌లో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 40 అసెంబ్లీ స్థానాల్లో 26 కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు ఐదు చోట్ల, బీజేపీ ఒకచోట గెలిచాయి. కాగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఒకేసారి జరగనుంది.

Exit mobile version