Site icon HashtagU Telugu

Liquor Scam Case : మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం కోడుకు అరెస్టు

chhattisgarh-former-cm-son-arrested-in-liquor-scam-case

chhattisgarh-former-cm-son-arrested-in-liquor-scam-case

Liquor Scam Case : ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపేశ్‌ బఘేల్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. ఆయన కుమారుడు చైతన్య బఘేల్‌ను అరెస్టు చేసి తమ కస్టడీలోకి తీసుకుంది. ఈ ఉదయం ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌ జిల్లాలోని భిలాయ్‌లో ఉన్న బఘేల్‌ నివాసంపై ఈడీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు తనిఖీలు సాగాయి. అనంతరం, చైతన్య బఘేల్‌ను అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈడీ ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మద్యం కుంభకోణం ద్వారా దాదాపు రూ.2,000 కోట్ల మేరకు అక్రమ లావాదేవీలు జరిగాయి. రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లినట్లు ఆధారాలు ఉన్నాయని, ఇందులో చైతన్య బఘేల్‌ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడయినట్టు అధికారులు చెబుతున్నారు.

Read Also: Visakhapatnam : విశాఖలో గాజు వంతెన..ఆగస్టు 15నాటికి పర్యాటకులకు అందుబాటులోకి

గతంలోనూ ఈ కేసులో భూపేశ్‌ బఘేల్‌ నివాసంలో సోదాలు జరిగాయి. అయితే తాజా దాడులు కొత్త ఆధారాల ఆధారంగా నిర్వహించామని ఈడీ తెలిపింది. అరెస్టు సమయంలో చైతన్య అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, పూర్తిగా సహకరించకపోవడంతో, ఆయన్ని అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. చైతన్యపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేశారు. చైతన్య అరెస్టు వార్త వెలువడిన వెంటనే భూపేశ్‌ బఘేల్‌ నివాసం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడ చేరుకొని ఈడీ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈడీ గో బ్యాక్’ నినాదాలతో ఆ ప్రాంతం ఉద్విగ్నంగా మారింది. ఈడీ అధికారులపై పార్టీవర్గాలు రాజకీయ ప్రతీకార చర్యల ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్ స్పందిస్తూ కేంద్రంపై మండిపడ్డారు.

ఈరోజు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు. మేము అదానీ సంస్థ కోసం చెట్లు కూల్చే వ్యవహారాన్ని సభలో లేవనెత్తాం. వెంటనే మా ఇంటికి ఈడీని పంపించారు. ఇది సాదృశ్యంగా జరగలేదు. పైగా నేడు నా కుమారుడి పుట్టినరోజు. ఇదేనా బహుమతి?అని ప్రశ్నించారు. మద్యం సిండికేట్‌, అక్రమ లాభాల పంపిణీ, ప్రభుత్వాధికారులపై ప్రభావం చూపడం వంటి అంశాలను ఈడీ తన దర్యాప్తులో కీలకంగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు, వ్యాపారులు విచారణకు గురయ్యారు. చైతన్య బఘేల్‌ అరెస్టుతో ఈ కేసు మరింత రాజకీయ వేడి సృష్టించే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ ఈడీ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది పూర్తిగా ప్రతీకార ధోరణి అని, రాజకీయ స్వార్థంతో చట్ట పరంగా సరికాని దాడులని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. దీనిపై మరిన్ని రాజకీయ ప్రకటనలు వెలువడే అవకాశముంది.

Read Also: Major Missiles: ఒకే రోజులో మూడు కీలక మిస్సైళ్లు స‌క్సెస్‌.. వాటి పూర్తి వివ‌రాలీవే!