Site icon HashtagU Telugu

Changur Baba : ఛంగూర్ బాబా మతమార్పిడి రాకెట్.. బయటపడ్డ రెడ్ డైరీ రహస్యం

Changur Baba

Changur Baba

Changur Baba : ఉత్తర్ ప్రదేశ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా ముసుగులో నడిపిన మతమార్పిడి రాకెట్ దేశాన్ని కుదిపేస్తోంది. ఆధ్యాత్మిక గురువుగా నటిస్తూ పెద్ద ఎత్తున మతమార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించిన ఈ రాకెట్ పరిమాణం అధికారులు ఊహించని స్థాయిలో విస్తరించిందని చెబుతున్నారు. ‘‘లవ్ జిహాద్’’ పేరుతో ముస్లిం యువకులను హిందూ యువతులతో పెళ్లిళ్లు చేయించి, వారిని మతం మార్చే దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యాచరణకు కావాల్సిన నిధులను ఛంగూర్ బాబా ముస్లిం యువకులకు లక్షల్లో అందజేసినట్లు విచారణలో తేలింది.

మిడిల్ ఈస్ట్‌లోని అరబ్ దేశాల నుంచి వందల కోట్ల నిధులు ఈ రాకెట్‌కు చేరుతున్నాయన్న సమాచారం వెలువడింది. దీన్ని పెద్ద ఎత్తున దేశద్రోహ చర్యగా భావించి యూపీ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులోకి దిగాయి.

రెడ్ డైరీ రహస్యం

ఏటీఎస్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ఈడీ ఇప్పుడు ఛంగూర్ బాబా వద్ద ఉన్న *“రెడ్ డైరీ”*పై దృష్టి సారించాయి. విదేశాల నుంచి రూ.106 కోట్ల ఫండింగ్ బయటపడిన కొద్ది రోజులకే ఈ రెడ్ డైరీ సంచలనంగా మారింది. ఎస్టీఎఫ్ దాడుల్లో ఛంగూర్ బాబా విలాసవంతమైన భవనం నుంచి ఈ డైరీ లభించిందని సమాచారం.

2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలకు ఛంగూర్ బాబా నిధులు సమకూర్చాడన్న ఆరోపణలు ఇప్పుడు గట్టి చర్చనీయాంశంగా మారాయి. ఈ డైరీలో ఆరుగురు ప్రముఖ నేతలు, పోలీస్ అధికారులు, ఇతర ప్రభావశీల వ్యక్తుల పేర్లు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సైకిల్ నుంచి కోట్ల దాకా.. ఛంగూర్ బాబా ప్రయాణం

ఛంగూర్ బాబా తన జీవితాన్ని ఒక సాధారణ వ్యాపారిగా ప్రారంభించాడు. సైకిల్‌పై ఉంగరాళ్లు, రంగురాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి వందల కోట్ల నిధులు సేకరించే స్థాయికి చేరాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని నేపాల్ సరిహద్దుకు సమీపంలోని బలరాంపూర్ జిల్లా మాధ్‌పూర్‌లో తన నెట్‌వర్క్‌ను విస్తరించి, పెద్ద ఎత్తున మతమార్పిడులను ప్రోత్సహించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఇప్పటివరకు 1000 మందికి పైగా హిందూ మహిళలను మతం మార్చాడన్న ఆరోపణలు బయటపడ్డాయి. అంతేకాదు, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు అభ్యర్థులకు నిధులు అందజేసి వారి ప్రాచుర్యం కోసం సాయం చేశాడని విచారణలో తేలుతోంది. ఈ కేసులో ఇప్పటికే జూలై 5న ఛంగూర్ బాబా, అతడి సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్లను లక్నోలో పోలీసులు అరెస్టు చేశారు.

WCL 2025 : కెప్టెన్ గా యువరాజ్ సింగ్.. ఇండియా ఛాంపియన్స్ జట్టు ఇంగ్లండ్‌లో సిద్ధం