GST : జీఎస్టీలో మార్పులు.. ధరలు తగ్గే అవకాశం ఉన్న వస్తువులు ఇవే..!

ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబ్‌లు ఉన్నాయి. ఇకపై ఈ విధానాన్ని సరళతరం చేస్తూ... 5% మరియు 18% అనే రెండు ప్రధాన శ్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం, ప్రస్తుతం 12% శ్లాబ్‌లో ఉన్న వస్తువులలో సుమారు 99% వస్తువులను 5% శ్లాబ్‌లోకి మారుస్తారు. అలాగే 28% శ్లాబ్‌లో ఉన్న వస్తు-సేవల్లో సుమారు 90% శాతం వాటిని 18% శ్లాబ్‌లోకి మార్చనున్నట్లు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Changes in GST.. These are the items whose prices are likely to decrease..!

Changes in GST.. These are the items whose prices are likely to decrease..!

GST : దేశీయ పన్ను వ్యవస్థలో క్రాంతికార మార్పుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలక సవరణలు తీసుకురావడానికి కేంద్ర ఆర్థిక శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు శ్లాబ్‌లను రెండు శ్లాబ్‌లుగా సులభతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. దీని ద్వారా సామాన్య ప్రజలకు, చిన్న వ్యాపారులకు భారం తగ్గిస్తూ… పన్ను పరంగా నూతన గమ్యం వైపు దేశాన్ని నడిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబ్‌లు ఉన్నాయి. ఇకపై ఈ విధానాన్ని సరళతరం చేస్తూ… 5% మరియు 18% అనే రెండు ప్రధాన శ్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం, ప్రస్తుతం 12% శ్లాబ్‌లో ఉన్న వస్తువులలో సుమారు 99% వస్తువులను 5% శ్లాబ్‌లోకి మారుస్తారు. అలాగే 28% శ్లాబ్‌లో ఉన్న వస్తు-సేవల్లో సుమారు 90% శాతం వాటిని 18% శ్లాబ్‌లోకి మార్చనున్నట్లు సమాచారం.

దీపావళి నుంచి అమలు?

ఈ మార్పులను దీపావళికి ముందుగానే అమల్లోకి తేవాలని కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జీఎస్టీ మండలి ఆమోదం లభించిన వెంటనే ఈ కొత్త విధానాన్ని అమలుచేయనున్నారు. దీని ఫలితంగా అనేక అవసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సామాన్యులకు ఇది నేరుగా ప్రయోజనకరంగా మారనుంది.

లాభపడే రంగాలు

ఈ కొత్త జీఎస్టీ విధానం జౌళి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, వైద్య సేవలు, బీమా వంటి కీలక రంగాలకు లాభం చేకూర్చనుంది. ప్రస్తుతం బీమాపై 18% జీఎస్టీ వసూలవుతున్నా, ఇది 5%కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక, కొన్ని అత్యవసర వైద్య సేవలు, బీమా సేవలపై జీరో శాతం జీఎస్టీ విధించే యోచన కూడా కేంద్రం పరిశీలిస్తోంది.

సేవల రంగంపై ప్రభావం

ఈ మార్పుల్లో సేవల రంగం మీద ప్రధానంగా ప్రభావం పడనుంది. చాలా సేవలపై ప్రస్తుతం అమల్లో ఉన్న 18% శ్లాబ్‌ను కొనసాగించే యోచనలో ఉన్న కేంద్రం, కొన్ని ప్రత్యేక సేవలపై మాత్రమే తక్కువ పన్ను రేటును అమలు చేయనుంది.

హానికర వస్తువులకు కఠిన చర్యలు

ఇక మరోవైపు, ఆరోగ్యానికి హానికరమైన వస్తువులపై అధిక పన్ను విధించాలని కేంద్రం చూస్తోంది. ఇప్పటికే ఉన్న 28% జీఎస్టీకి అదనంగా 40% ప్రత్యేక పన్ను (Sin Tax) విధించే అవకాశం ఉందని సమాచారం. దీని ద్వారా ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, మరోవైపు ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని అందించాలన్నదే లక్ష్యం.

వ్యాపారులకు ఊరట

చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులకు ఈ విధానం ఊరట కలిగించనుంది. తక్కువ పన్ను రేట్ల వల్ల నిబంధనలు సరళతరం అవుతాయి. లెక్కలు నిర్వహించడంలో సులభతరం అవుతుంది. పన్ను చెల్లింపుల ప్రక్రియ గణనీయంగా సులభపడనుంది. మొత్తంగా, జీఎస్టీ విధానంలో ఈ కీలక మార్పులు అమలవుతే, అది ప్రజల ఖర్చులకు గణనీయంగా ఊరటనివ్వనుంది. దీపావళి కానుకగా కేంద్రం ఇచ్చే ఈ మార్పులు, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహం నింపే అవకాశాలున్నాయి.

ఇకపోతే..జీఎస్టీ సవరణలతో ధరలు తగ్గే అవకాశం ఉన్న వస్తువులు ఇవే..

. టూత్‌ పేస్ట్‌, టూత్‌ పౌడర్‌, హెయిర్‌ ఆయిల్‌, సబ్బులు
. గొడుగులు, కుట్టు మెషీన్లు
. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌, శీతలీకరించిన కూరగాయల వంటి ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌
. ప్రెజర్‌ కుక్కర్లు, వాటర్‌ ఫిల్టర్లు, ప్యూరిఫయర్లు (నాన్‌ ఎలక్ట్రానిక్‌)
. ఎలక్ట్రానిక్‌ ఐరన్స్‌, కంప్యూటర్లు, గీజర్లు, వాక్యూమ్‌ క్లీనర్లు (నాన్‌ కమర్షియల్‌)
. రెడిమేడ్‌ దుస్తులు, రూ.500-1000లోపు ఉన్న పాదరక్షలు
. చాలా రకాల వ్యాక్సిన్లు, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌, టీబీ డయాగ్నోస్టిక్‌ కిట్లు
. కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు
. జామెట్రీ బాక్సులు, మ్యాప్‌లు, గ్లోబ్‌లు, సోలార్‌ వాటర్‌ హీటర్లు
. అల్యూమినియం, స్టీల్‌తో తయారుచేసిన వంటపాత్రలు, ఇతర సామగ్రి, నాన్‌ కిరోసిన్‌ స్టవ్‌లు
. సైకిళ్లు, ప్రజా రవాణా వాహనాలు, వ్యవసాయ పరికరాలు, వెండింగ్‌ మెషీన్లు
. గ్లేజ్డ్‌ టైల్స్‌ (లగ్జరీ కానీ వేరియంట్లు), లిక్విడ్‌ సోప్స్‌
. సిమెంట్‌, రెడీ మిక్స్‌ కాంక్రీట్‌
. ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, డిష్‌వాషర్లు
. కార్లు, మోటార్‌సైకిల్‌ సీట్లు, సైకిళ్లు, వ్యవసాయ వాహనాలకు వాడే రబ్బర్‌ టైర్లు, ప్లాస్టర్‌
. ప్రొటీన్‌ సప్లిమెంట్లు, షుగర్‌ సిరప్‌లు, అరోమా కాఫీ, కాఫీ ఉత్పత్తులు
. టాంపర్డ్‌ గ్లాస్‌, అల్యూమినియం ఫాయిల్‌, రేజర్లు, ప్రింటర్లు, మ్యానిక్యూర్‌/పెడిక్యూర్‌ కిట్లు

Read Also:  Telangana : సృష్టి ఫెర్టిలిటీ కేసు..నేరాన్ని అంగీకరించిన డాక్టర్‌ నమ్రత

  Last Updated: 16 Aug 2025, 01:49 PM IST