ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ బుకింగ్ నిబంధనలలో కీలక మార్పులు చేశాయి. దేశవ్యాప్తంగా ఎల్‌పిజి (LPG) సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు మరియు సిలిండర్ల కొరతను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు రీఫిల్ బుకింగ్ ప్రక్రియను మరింత కఠినతరం చేశాయి. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు, అందరికీ సమానంగా సిలిండర్లు అందేలా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. దీని ప్రకారం, వినియోగదారుల కనెక్షన్ రకాన్ని బట్టి రీఫిల్ బుకింగ్ చేసుకునే సమయ పరిమితిని (Time Gap) నిర్ణయించారు. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి రావడంతో, సామాన్య ప్రజలు తమ గ్యాస్ వినియోగంపై ముందస్తు ప్రణాళిక వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నూతన నిబంధనల వివరాల్లోకి వెళ్తే.. డబుల్ సిలిండర్ (DBC) కనెక్షన్ ఉన్నవారు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత, రెండో సిలిండర్ కోసం కనీసం 35 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద కనెక్షన్ పొందిన లబ్ధిదారులకు ఈ గడువును 45 రోజులుగా నిర్ణయించారు. కేవలం సింగిల్ సిలిండర్ మాత్రమే ఉన్న వినియోగదారులు కూడా ఒక బుకింగ్ తర్వాత మరో రీఫిల్ కోసం 25 రోజుల కాలపరిమితిని పాటించాల్సి ఉంటుంది. ఈ నిర్ణీత గడువు ముగియకముందే బుక్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆయిల్ కంపెనీల సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఆ అభ్యర్థనలను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది.
ఈ ఆంక్షల వల్ల చిన్న కుటుంబాలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినప్పటికీ, ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలకు మరియు గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండే గృహాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ముఖ్యంగా పండుగలు లేదా ఫంక్షన్ల సమయంలో అదనపు గ్యాస్ అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ మార్కెట్ విక్రయాలను అదుపు చేసేందుకు ఈ డిజిటల్ నియంత్రణలు దోహదపడతాయని కంపెనీలు భావిస్తున్నాయి. వినియోగదారులు తమ బుకింగ్ హిస్టరీని గమనించుకుని, గ్యాస్ అయిపోవడానికి ముందే ఈ నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
