India to Bharat : పాఠ్య పుస్తకాల్లో దేశం పేరు మార్పు: అభ్యంతరాలు.. ఆమోదాలు

దేశం పేరు 'ఇండియా' (India) స్థానంలో 'భారత్' (Bharat) నే ఖరారు చేయడానికి మన పాలకులు నడుం కట్టుకున్నట్టు అర్థమవుతోంది.

  • Written By:
  • Updated On - October 26, 2023 / 10:20 AM IST

By: డా. ప్రసాదమూర్తి

India to Bharat Country name change in Textbooks : దేశం పేరు ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ నే ఖరారు చేయడానికి మన పాలకులు నడుం కట్టుకున్నట్టు అర్థమవుతోంది. జి20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి అతిథి దేశాలకు పంపిన ఆహ్వాన పత్రంలో ఇండియా స్థానంలో భారత్ అని ఉంది. అప్పటినుంచి మన దేశం పేరును కేవలం భారత్ అని మాత్రమే ఉంచేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు అందరికీ అర్థమైంది. ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి దీని మీద ఒక స్పష్టమైన వైఖరి వ్యక్తం కాకపోవడంతో ఆ పేరు మార్పు కేవలం రాష్ట్రపతి ఆహ్వానం వరకు మాత్రమే అని అర్థం చేసుకొని అందరూ ఆగిపోయారు. కానీ పాలకుల ప్రయత్నాలు అక్కడితో ఆగలేదని ఇప్పుడు అర్థమవుతుంది.

రాజ్యాంగంలో కూడా మన దేశాన్ని ఇండియా (India) లేదా భారత్ (Bharat) అని పిలవచ్చు అని పేర్కొన్నారు. దీనిమీద మేధావులు ఎన్ని చర్చలు చేసినప్పటికీ, ఎన్ని సూచనలు సలహాలు ఇచ్చినప్పటికీ, పేరు మార్పు వల్ల ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు, ఆచరణలో ఎదురయ్యే అవరోధాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఇండియా అనే పదం వలసవాదంతో వచ్చినది అని, ఆ పదం ఉన్నంతకాలం వలసవాద ప్రభావం మన మీద ఉంటూనే ఉంటుందని మన పాలకుల వాదం. అందుకే మనవారు ఇండియా (India) స్థానంలో భారత్ అనే పదాన్ని ఖరారు చేయడానికి సిద్ధమయ్యారు అని చెప్పడానికే ఇటీవల ఎన్సీఈఆర్టీ(NCERT) పార్టీ పుస్తకాల్లో మార్పు కోసం సాగుతున్న ప్రయత్నాలు చూస్తే అర్థమవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సామాజిక శాస్త్రంలో ఇండియా (India) అని ఉన్నచోటల్లా దాన్ని భారత్ అని మార్చడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ విషయం మీద ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఎన్సీఈఆర్టీ నియమించింది. పాఠ్యపుస్తకాల్లో ఇండియా పేరు స్థానంలో భారత్ అని పెట్టడానికి సర్వపమ ప్రయత్నాలూ జరుగుతున్న వార్త రావడంతో, ప్రతిపక్షాలు దీనిపై తమ అభ్యంతరాలను స్పష్టంగా వ్యక్తం చేశాయి. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని దీని మీద అల్లరి చేయడం తొందరపాటు చర్య అని కమిటీ పేనల్ చైర్మన్ సి.ఐ. ఇసాక్ అన్నారు. ప్రైమరీ స్థాయి నుంచి హైస్కూల్ స్థాయి వరకు ఉన్న పాఠ్య గ్రంధాల్లో మాత్రమే ఇండియా (India) స్థానంలో భారత్ అని మార్చడానికి కమిటీ ప్రతిపాదన చేసిందని, ఈ ప్రతిపాదన మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అప్పుడే దీనిమీద విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన అంటున్నారు. కానీ కమిటీలో ఉన్న నిపుణులు ఇండియా స్థానంలో భారత్ అనే పదాన్ని చేర్చడానికి అందరూ సుముఖత వ్యక్తం చేసినట్టు మీడియా ద్వారా తెలుస్తోంది. భారత్ అనే పదం మాత్రమే మన దేశానికి సంపూర్ణార్థంలో ప్రాతినిధ్యం వహిస్తుందని నిపుణుల అభిప్రాయం.

ఒకపక్క పాఠ్యపుస్తకాలలో పేరు మార్చడానికి అన్ని రకాల కసరత్తులు జరుగుతూ ఉండగా, ప్రయత్నాలు కొనసాగుతూ ఉండగా, ఇంకా దాని మీద ఏమీ నిర్ణయం లేదు తీసుకోలేదని కమిటీ చైర్మన్ చెప్పడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. కేవలం పాఠ్య పుస్తకాల్లో పేరు మాత్రమే కాదు చరిత్ర గ్రంథాల్లో, కోర్టుల్లో, వాణిజ్య లావాదేవీల్లో, విదేశీ సంబంధాలు, వ్యాపార సంబంధాల పత్రాలు, ఒప్పందాలు, తదితర చారిత్రక దస్తావేజుల్లో పేరును మార్చవలసి ఉంటుంది. కాబట్టి కేవలం పేరు మార్చడానికి ఉత్సాహం చూపిస్తే సరిపోదు. దీనిలో ఉన్న సాధ్యసాద్యాలను, సాంకేతిక అవరోధాలను పరిశీలించి ఒక విస్తృత స్థాయి దేశవ్యాప్త చర్చ జరిగిన తర్వాత, అన్ని పరిశీలనలు పరిశోధనలు పూర్తయిన తర్వాత ఇలాంటి మార్పులకు ప్రభుత్వం పూనుకోవాలి. కానీ ఏం చేసినా ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో తక్షణ నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపక్షాలతో గాని నిపుణులతో గానీ ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా ఆ నిర్ణయాలను అమలు చేయడానికి సిద్ధపడటం తరచూ మనం దేశంలో చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు ఈ పాఠ్యపుస్తకాల్లో దేశం పేరు విషయం కూడా త్వరలోనే అమలు జరిగినా ఆశ్చర్య కోవాల్సిన పని లేదని పలువురు భావిస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం ఈ చర్యను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. పలువురు మేధావులు, నిపుణులు ఈ విషయంలో అంత తొందర కూడదని సూచనలు సలహాలు ఇస్తున్నారు. మరి దీనిమీద ఎన్సీఈఆర్టీ నియమించిన కమిటీ గాని ఎన్సీఈఆర్టీ అధికారులు గానీ దాని వెనుకున్న ప్రభుత్వం గానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Also Read:  PM Narendra Modi: నేడు షిర్డీలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ..!