Site icon HashtagU Telugu

Chandrayaan 3-July 14 : జులై 14న చంద్రయాన్-3.. ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై పాగా!

Chandrayaan-3

Chandrayaan 3 Explained

Chandrayaan 3-July 14 : చంద్రుడిపై అధ్యయనానికి భారత్ చేపట్టిన చంద్రయాన్-3 జులై 14న మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. 

ఈ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఇప్పటికే కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది.

చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ లో  విక్రమ్ అనే ల్యాండర్, ప్రజ్ఞాన్ అనే రోవర్  ఉన్నాయి. 

ఇవి ఆగస్టు 23న చంద్రునిపై దిగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈసారి కూడా చంద్రుని దక్షిణ ధ్రువంపైనే 70 డిగ్రీల అక్షాంశంలో విక్రమ్, ప్రజ్ఞాన్ అడుగు పెట్టనున్నాయి. 

అన్నీ అనుకున్నట్టు జరిగితే చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన ప్రపంచంలోనే తొలి మూన్ మిషన్ గా చంద్రయాన్-3(Chandrayaan 3-July 14) చరిత్ర సృష్టిస్తుంది. 

ఎందుకంటే గతంలో ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ లు  అన్నీ చంద్రునిపై భూమధ్య రేఖ ప్రాంతంలో ల్యాండ్ అయ్యాయి.

గతంలో దక్షిణ ధ్రువం వద్ద ఎందుకు దిగలేదో తెలుసా ?

చంద్రునిపై భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతంలో భూభాగం, ఉష్ణోగ్రత పూర్తి అనుకూలంగా ఉంటాయి. అక్కడి పరిసరాలు కూడా పరిశోధనకు అనుకూలంగా ఉంటాయి. ఉపరితలం సమాంతరంగా, మృదువుగా ఉంటుంది. ఏటవాలు ప్రాంతమే లేదు. కొండలు కానీ.. లోయలు కానీ లేవు. సూర్యరశ్మి సమృద్ధిగా ఉంటుంది. అన్నింటికీ మించి అది  భూమికి అభిముఖంగా ఉంటుంది. తద్వారా సౌరశక్తితో ల్యాండర్, రోవర్ లకు నిరంతరం శక్తిని ఇవ్వొచ్చు. కానీ చంద్రుని ధ్రువ ప్రాంతాల్లో ఇందుకు భిన్నమైన భూభాగం ఉంటుంది.  వాతావరణం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.

Also read : 2 Pawars-Modi Event : ఆగస్టు 1న మోడీ ప్రోగ్రాంకు శరద్ పవార్, అజిత్ పవార్

ధ్రువ ప్రాంతాల్లో చిమ్మచీకటి.. ఎందుకు ?

చంద్రుని ధ్రువ ప్రాంతాల్లోని చాలా భాగాలు చిమ్మచీకటిగా ఉంటాయి.భూమి యొక్క అక్షం సౌర కక్ష్య సమతలానికి 23.5 డిగ్రీల వంపు తిరిగి ఉంటుంది. చంద్రుని అక్షం 1.5 డిగ్రీలు మాత్రమే వంగి ఉంటుంది. ఈ ప్రత్యేకత వల్లే చంద్రుని ఉత్తర, దక్షిణ ధ్రువాలకు సమీపంలో ఉన్న లోయలపై సూర్యరశ్మి ఎన్నడూ పడదు. ఉష్ణోగ్రతలు మైనస్ 230 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయి. కొండలు, లోయలు విస్తరించి ఉంటాయి. దీంతో ల్యాండర్, రోవర్లలోని  పరికరాల నిర్వహణకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఇంతకాలం చంద్రుని ధ్రువ ప్రాంతాల్లో పరిశోధనలు జరగలేదు.