Site icon HashtagU Telugu

New UPA: హ‌స్తిన చ‌క్రంపై ఆ ఆరుగురు.!

6 Leaders

6 Leaders

కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర కూట‌మికి నాయ‌క‌త్వం వ‌హించడానికి మ‌మ‌త బెన‌ర్జీ, కేజ్రీవాల్, శ‌ర‌ద్ ప‌వార్‌, కేసీఆర్ పోటీ ప‌డుతున్నారు. కాబోయే ప్ర‌ధాని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటూ ఆయ‌న అభిమానులు ఉబ‌లాట ప‌డుతున్నారు. ఇక ఎప్పుడూ ఢిల్లీలో చ‌క్రం తిప్పే నాయ‌కునిగా పేరున్న చంద్ర‌బాబు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. కానీ, ఆయ‌న స‌మ‌కాలీకులుగా పేరున్న మ‌మ‌త‌, శ‌ర‌ద్ ప‌వార్ , కేసీఆర్ మాత్రం చాలా దూకుడుగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీకు ప్ర‌త్యామ్న‌యం అవ‌స‌ర‌మ‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. ప‌వార్‌, మ‌మ‌త భేటీ త‌రువాత ఆ విష‌యాన్ని వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

యూపీఏ 2014 నుంచి మ‌న‌గ‌డ‌లో లేద‌నే విష‌యాన్ని మ‌మ‌త‌ బ‌య‌ట పెట్టారు. కేవలం 44 మందితో ఆ కూట‌మి పార్ల‌మెంట్ లోప‌ల, బ‌య‌ట ఎన్డీయేను ఏమీ చేయ‌లేక‌పోయింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌దేళ్ల యూపీఏ ప్ర‌స్తానాన్ని ఆమె ఎండ‌గ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ మిత్ర ప‌క్షాల ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రించిందో…మ‌న‌నం చేసుకుంది. టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ లు, టీఎంసీ, డీఎంకే, అన్నాడీఎంకే..ఇలా ప‌లు పార్టీలు ఏ విధంగా యూపీఏకు దూరం అయ్యాయో..రాజ‌కీయ విశ్లేష‌ణ చేసింది. ఆనాడు వాజ్ పేయ్ లాంటి సెక్యుల‌ర్ ఆధీనంలో ఉన్న ఎన్డీయేను ఎదుర్కోగ‌లిగిన అంశాన్ని ఉద‌హ‌రించారు. ఇవాళ ప‌రిస్థితులు వేర‌ని మ‌మ‌త అభిప్రాయం.
చాలా రాష్ట్రాల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్రాంతీయ పార్టీలు బ‌లంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నామ‌మాత్రంగా ఉంది. పంజాబ్‌, రాజ‌స్థాన్ లాంటి చోట్ల అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ నాయ‌క‌త్వం బ‌లంగా లేద‌ని మ‌మ‌త అంచ‌నా. అందుకే, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీల‌తో కూడిన ఫ్రంట్ కావాల‌ని భావిస్తున్నారు. ఆ కోణం నుంచి అడుగులు వేస్తోన్న మ‌మ‌త..ఇక యూపీఏ లేద‌నే విష‌యాన్ని వెల్ల‌డించి దేశ రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది.

Also Read :  చంద్ర‌బాబు మంచిత‌న‌మే..మైన‌స్.!

వాస్త‌వంగా కాంగ్రెస్ నాయ‌క‌త్వంలోని యూపీఏకి సార‌థ్యం వ‌హించాల‌ని చాలా కాలంగా ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ఉవిళ్లూరుతున్నాడు. అదే స‌మ‌యంలో ఆ పార్టీలోని లీడ‌ర్లు కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది. అందుకే, ఇప్పుడు మ‌మ‌త బాట‌న న‌డిచేందుకు ఆయ‌న సిద్ధంగా ఉన్నార‌ని వినికిడి. ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత మోడీ సార‌థ్యంలోని ఎన్డీయే ప్ర‌భుత్వానికి ప్ర‌త్యామ్నాం మ‌మ‌త అనే ఆలోచ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో వ‌చ్చేసింది. దానికి బ‌లం చేకూరేలా ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేల‌ను అందించాడు. దేశ వ్యాప్తంగా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని విస్త‌రింప చేయ‌డానికి ఇన్ పుట్స్ ఇచ్చాడ‌ట‌. ఆ మేర‌కు గోవా ఎన్నిక‌ల్లో టీఎంసీ కీల‌కం కానుంది. రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పాగ వేయ‌డానికి సిద్దం అవుతోంది.

కాంగ్రెస్‌, బీజేపీల‌కు స‌మ‌దూరంలో ఉన్న బ‌ల‌మైన పార్టీలు టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ, ఆప్, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, జ‌న‌తాద‌ళ యూ, జేడీఎస్ ..త‌దిత‌రాలు ఉన్నాయి. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా 2018లోనే అడుగులు వేశాడు. ఆ సంద‌ర్భంగా మ‌మ‌త‌, దేవెగౌడ‌, న‌వీన్ ప‌ట్నాయక్, కేజ్రీవాల్ త‌దిత‌రుల‌ను క‌లిశాడు. ఆ త‌రువాత జ‌రిగిన 2018 అసెంబ్లీ, 2019లో లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఆయ‌న. సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మ‌ళ్లీ బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డుతున్నాడు. అదే దిశ‌గా మ‌మ‌త, కేజ్రీ వాల్ కూడా మోడీ స‌ర్కార్ మీద పోరాటం చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు.ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి లోక్ స‌భ‌లో ప్రస్తుతం 22 మంది ఎంపీలు ఉన్నారు. నాలుగో అతి పెద్ద పార్టీగా అక్క‌డ ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే సంఖ్య ఉంటే..జ‌గ‌న్ కీల‌కం అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఒక వేళ రివ‌ర్స్ అయితే టీడీపీకి పెద్ద సంఖ్య‌లో ఎంపీలు వ‌చ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు చంద్ర‌బాబు ఢిల్లీ చ‌క్రం మ‌ళ్లీ తిప్పే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికైతే..మ‌మ‌త‌, కేజీవాల్‌, శ‌ర‌ద్ ప‌వార్,కేసీఆర్ ఢిల్లీ చ‌క్రం తిప్ప‌డానికి వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా బాబు, జ‌గ‌న్ తో స‌హా హ‌స్తిన చ‌క్రం ఆ ఆరుగురిలో ఎవ‌రి చేతికి వెళుతుందో..చూద్దాం.!