Site icon HashtagU Telugu

Kharge: కాంగ్రెస్‌ను ఖర్గే గాడిన పెడతారా ?

Mallikarjun Kharge Imresizer

Mallikarjun Kharge Imresizer

1998లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు సోనియా గాంధీ. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత అంతకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పార్టీ పగ్గాలు అందుకున్నారు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే. మరి కొత్త అధ్యక్షుడి రాకతోనైనా పార్టీ హస్తవాసి మారేనా..? ఖర్గే ముందున్న సవాళ్లేంటి..?
గాంధీల సమక్షంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు మల్లికార్జున ఖర్గే. తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి బ్యాటన్ అందుకున్నారు. 24 ఏళ్ల తర్వాత ఏఐసీసీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. నూతన అధ్యక్షుడు ఖర్గేకు అభినందనలు తెలియజేశారు సోనియా, రాహుల్ గాంధీ.ఓ కార్మికుడి బిడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం మరిచిపోలేని అనుభూతి అన్నారు ఖర్గే. సోనియా గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి అన్నివిధాలా కృషి చేస్తానన్న ఖర్గే.. నేతలు కార్యకర్తలు పూర్తి శక్తిసామర్థ్యాలతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు రావడం తనకు పెద్ద రిలీఫ్‌ అన్నారు సోనియా గాంధీ. ఖర్గే అనుభవం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని.. శ్రేణులకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు.కాంగ్రెస్ నూతన సారథి మల్లికార్జున ఖర్గే ముందు అనేక సవాళ్లున్నాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు తొలి పరీక్ష. రెండుచోట్లా కాంగ్రెస్‌కు పెద్దగా విజయావకాశాలు లేవు. ఇక రాజస్థాన్, కర్ణాటకల్లో అంతర్గత కుమ్ములాటలతో పార్టీ సతమతమవుతోంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లే నేర్పు ఖర్గేలో ఉన్నా.. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాల్లో ఐక్యత సాధించడం మాత్రం పెద్ద సవాలే. 2023లో సొంత రాష్ట్రం కర్ణాటక సహా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నడిపించే బాధ్యత ఖర్గేపైనే పడనుంది. ఇవన్నీ ఒక ఎత్తు. కాగా.. ఖర్గేని రిమోట్‌తో నియంత్రించేది గాంధీ కుటుంబమేనంటూ వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేలా పనిచేయడం మరో ఎత్తు.

Exit mobile version