Myanmar Border : మయన్మార్‌లో సైన్యానికి, మూడు తిరుగుబాటు గ్రూపులకు మధ్య గతేడాది అక్టోబరు నుంచి తీవ్ర యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతానికి అక్కడ తిరుగుబాటు గ్రూపులదే పైచేయిగా ఉంది. చైనా, ఇండియా బార్డర్‌లోని చాలా మిలిటరీ చెక్ పోస్టులను మయన్మార్ తిరుగుబాటు గ్రూపులు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ తరుణంలో మయన్మార్ సైనికులు, ప్రజలు ప్రాణాలను రక్షించుకునేందుకు వందలాదిగా మిజోరం రాష్ట్రంలోని లాంగ్‌ట్లాయ్ జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. ఈవిషయాన్ని మిజోరం సీఎం లాల్‌దుహోమా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో తాము మయన్మార్ ప్రజలకు సాయం చేస్తున్నామని.. ఇప్పుడు ఆ దేశం నుంచి సైనికులు కూడా వస్తున్నారని వివరించారు. ఇప్పటికే 400 మందిని వెనక్కి పంపించేసినట్లు అమిత్ షాతో సమావేశం తర్వాత మిజోరం సీఎం లాల్‌దుహోమా మీడియాకు వెల్లడించారు. మయన్మార్‌లో పెరుగుతున్న ఘర్షణలు అక్కడ అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈనేపథ్యంలో ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. మయన్మార్ నుంచి చొరబాట్లు ఆపేందుకు సరిహద్దు వద్ద కంచె నిర్మిస్తామని(Myanmar Border) అనౌన్స్ చేశారు. ‘‘ఇప్పటివరకు మయన్మార్, భారతదేశాల సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి భద్రతా తనిఖీలు లేకుండానే రాకపోకలు సాగించే అవకాశం ఉండేది. అయితే ఈ ముసుగులో వేలాదిమంది మయన్మార్ వాసులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. దీనికి ముగింపు పలకబోతున్నాం’’ అని అమిత్‌షా వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
మయన్మార్‌లో 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి సైనిక పాలకులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో దేశంలో అంతర్యుద్ధం నెలకొంది. ఈ దాడుల్లో ‘త్రీబ్రదర్‌హుడ్ అలయన్స్ (టీబీఏ)’ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్‌డీఏఏ), టాంగ్ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్ ఆర్మీ(ఏఏ) భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తిమంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది. ఇండియా బార్డర్‌లోని మయన్మార్ ఆర్మీ శిబిరాలను రెబల్ గ్రూప్ అరాకన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. మయన్మార్‌లో సాగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఇప్పటివరకు 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించారు. సరిహద్దుల్లో ఈవిధమైన స్వేచ్ఛా సంచారంపై మిజోరం ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.వారిని తిరిగివెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే కేంద్ర సర్కారు దీనిపై ప్రకటన చేసింది.