Ladakh : ఇప్పటికే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కీలక తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో మరో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఈవిషయాన్ని సోమవారం ఉదయం ఎక్స్ వేదికగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ‘‘సుసంపన్నమైన లద్దాఖ్‌ను(Ladakh) నిర్మించాలనేది ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంకల్పం. ఇందులో భాగంగానే లద్దాఖ్‌లో మరో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ఆయన వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘మేం లద్దాఖ్‌లో కొత్తగా జన్‌స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌థాంగ్ జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా అక్కడ పాలన మరింత బలోపేతం అవుతుంది. ప్రతీ ఇంటికి ప్రభుత్వ ఫలాలు చేరుతాయి. లద్దాఖ్ ప్రజల అభ్యున్నతికి మేం పాటుపడతాం’’ అని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా స్పందించారు. ‘‘లద్దాఖ్ ప్రజల శ్రేయస్సు కోసం, వారికి మరింత మెరుగైన పాలనను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి’’ అని మోడీ పేర్కొన్నారు.
Also Read :Kim Jong Un : సంబరపడుతున్న కిమ్ జోంగ్ ఉన్.. సూసైడ్ డ్రోన్ రాకతో జోష్
ఇంతకుముందు లద్దాఖ్ ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోనే భాగంగా ఉండేది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ కేంద్ర హోం శాఖ నియంత్రణలో ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం లద్దాఖ్ ప్రాంతంలో లేహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. వాటినే పునర్విభజన చేసిన కొత్తగా మరో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో అక్కడి మొత్తం జిల్లాల సంఖ్య ఏడుకు పెరగనుంది. దీనివల్ల ప్రభుత్వ పాలనా ఫలాలకు ప్రజలకు సులభంగా చేరుతాయని ఎన్డీయే సర్కారు భావిస్తోంది.