డా. ప్రసాదమూర్తి
అధికార బలం కొన్ని కొన్ని సార్లు ఎలాంటి పనులైనా చేయిస్తుంది. లోక్సభలో 300కు పైగా ఎంపీల బలం ఉన్న అధికార బిజెపి తాను చేసిందే శాసనం, చెప్పిందే రాజ్యాంగం అన్నట్టు ప్రవర్తిస్తోంది. పెరేడ్లో ఢిల్లీ పంజాబ్ ప్రభుత్వాలకు చెందిన ప్రదర్శన బృందాలకు అవకాశం ఇవ్వలేదట. ఢిల్లీలో, పంజాబ్ లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు. తమ వ్యతిరేక విపక్ష పార్టీల పట్ల బిజెపి అగ్రనాయకత్వం ఎంతటి వివక్షకైనా తెగిస్తుందని చెప్పడానికి ఇంతకు మించిన తాజా ఉదాహరణ మరొకటి ఉండదు. రిపబ్లిక్ డే పెరేడ్ లో ఈ రెండు రాష్ట్రాల సాంస్కృతిక బృందాలు లేకుండా చేయడం బిజెపి వారి నీచ రాజకీయానికి ఒక నమూనా అని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కానీ బిజెపి వారు దీన్ని చాలా తేలికగా కొట్టి పారేస్తున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాల ప్రదర్శనలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఏ రాష్ట్రాలకు ఏ ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే విషయం ఒక ప్రత్యేక కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, ఆ కమిటీ నిర్ణయాన్ని కూడా ఆప్ నాయకులు రాజకీయం చేస్తున్నారని, ఇది చాలా సిగ్గుచేటైన విషయమని బిజెపి నాయకులు ఆప్ విమర్శను తిప్పి కొడుతున్నారు. అయితే ఈ వివాదం అంత త్వరగా ముగిసేలా లేదు. దేశంలో పంజాబ్, ఢిల్లీ కూడా అంతర్భాగమైన రాష్ట్రాలే కదా. వాటిని పరిపాలించే పార్టీలను దృష్టిలో పెట్టుకొని యావత్తు దేశానికి సంబంధించిన రిపబ్లిక్ డే ఉత్సవాలలో ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడం ఎంతవరకు సమిచితమైందని పలు వర్గాలలో పెద్ద చర్చకు ఇప్పుడు దారితీసింది.
రిపబ్లిక్ డే ఉత్సవాల పెరేడ్ లో భాగంగా తమ రాష్ట్రాలకు కూడా అవకాశం ఇస్తే తాము సాధించిన అనేక రంగాలలో అభివృద్ధి అక్కడ ప్రదర్శనకు పెట్టే అవకాశం ఉండేదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అంటున్నారు. ఢిల్లీకి అవకాశం ఉంటే ఆ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విద్యా ఆరోగ్య రంగాలలోని ప్రయోగాత్మక అంశాలు రిపబ్లిక్ డే సందర్భంగా తాము ప్రదర్శించే అవకాశాన్ని కోల్పోయామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. ఢిల్లీ వాసులంత విశాలమైన హృదయం ప్రధాని నరేంద్ర మోడీకి ఉంటే ఆయన రిపబ్లిక్ డే పెరేడ్ లో ఢిల్లీకి అవకాశం ఇచ్చేవారని ఆమె అన్నారు. ఈ ఉత్సవాలలో బిజెపి పాలిత అస్సాం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉంది. ఇంతకుముందు కూడా ఢిల్లీ పంజాబ్ లకు ఈ ఉత్సవాల్లో పాలుపంచుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. ఇదేమి వివక్ష అని అడగడాన్ని కూడా బిజెపి వారు రాజకీయంగా భావిస్తున్నారు. ఈ విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తీవ్రంగా స్పందించారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పంజాబ్ ను వెలివేయడం అంటే స్వాతంత్ర్య సమరంలో పంజాబీలు చేసిన త్యాగాలను అవమానపరచడమేనని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే అసలు ఈ ఉత్సవాలలో ఈ రెండు రాష్ట్రాలను ఎందుకు వెలివేసినట్లు అనేదాన్ని ఆరా తీస్తే బిజెపి వారు ఒకటే మాట చెబుతున్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే పంజాబ్, ఢిల్లీ బృందాల వాహనాల మీద ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఫోటోలు ఉంటాయని, దానికి కమిటీ అభ్యంతరం చెప్పిందని బిజెపి నాయకులు చెప్తున్నారు. ఏ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం పరిపాలిస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీల నాయకుల ఫోటోలు ఉంటే తప్పులేదు. ఇది చాలా చిన్న విషయం. కానీ దీన్ని గంభీరంగా తీసుకొని మొత్తం రిపబ్లిక్ డే ఉత్సవాల నుంచి ఆ రాష్ట్రాలను బహిష్కరించడం సరికాదని పలువురు విజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో అటు అధికార బిజెపి గానీ, ఇటు ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఇకముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.
Read Also : Navy – Chattrapati Shivaji : ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నేవీ అడ్మిరల్స్ భుజకీర్తులు