Onion: ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 01:36 PM IST

Onion: దేశంలోని చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 నుంచి రూ.60కి పైనే ఉంది. దీంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి దీంతో ఉల్లి ధరలను నియంత్రించేందుకు 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించారు. దేశంలో ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు, ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఎగుమతులపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.

అయితే, కొన్ని మినహాయింపులు ఇవ్వబడ్డాయి. ఈ నోటిఫికేషన్‌కు ముందు నౌకల్లో లోడ్ చేసిన ఉల్లి, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వెల్లడించింది. అయితే, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు ఎగుమతి చేసుకోవచ్చని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్లలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఇటీవల ఎగుమతి విధానాన్ని పలుమార్లు సవరించింది. అయితే దేశవ్యాప్తంగా పలు చోట్ల తీవ్ర వర్షాలు పడటంతో ఉల్లి పంటపై ప్రభావం పడింది. దీంతో ఉల్లి ధరలు పెరిగాయి.