Site icon HashtagU Telugu

FM Radio: ఎఫ్ఎం రేడియో చానెళ్లకు కేంద్రం వార్నింగ్..!

Fm Radio

Fm Radio

మద్యం, డ్రగ్స్, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్, తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలను, అలాంటి కంటెంట్ ను ప్రసారం చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎం రేడియో (FM Radio) ఛానెళ్లను హెచ్చరించింది. అలాంటి పాటలు, విషయాలను ప్రసారం చేయడం ఆలిండియా రేడియో ప్రోగ్రామ్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇటువంటి పాటలు, కంటెంట్ యువతను ప్రభావితం చేస్తాయని, అది గ్యాంగ్‌స్టర్ల సంస్కృతికి దారితీస్తుందని అభిప్రాయపడింది. ఎఫ్ఎం రేడియో (FM Radio) ఛానెళ్లు మైగ్రేషన్ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ అగ్రిమెంట్ (MGOPA)లో నిర్దేశించిన నిబంధనలు, షరతులను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఆలిండియా రేడియోను అనుసరించి MGOPA అందించే ప్రోగ్రామ్, అడ్వర్టైజ్‌మెంట్ కోడ్‌లను కచ్చితంగా అనుసరించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించడం శిక్షార్హమని హెచ్చరించింది.

కొన్ని FM చానెళ్లు మద్యం, ఆయుధాలు, గ్యాంగ్ స్టర్ సంస్కృతిని కీర్తించే పాటలను వినిపించడం వల్ల యుక్త వయసులోని పిల్లలు ప్రభావితమవుతారని, అది తుపాకీ సంస్కృతికి దారి తీస్తుందని పంజాబ్, హర్యానా కోర్టు చేసిన న్యాయపర గమనిక నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అప్రమత్తం అయింది. ఇటువంటి కంటెంట్ ఆలిండియా ప్రోగ్రామ్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి సదరు ఎఫ్ఎం రేడియో స్టేషన్ల అనుమతిని నిలిపివేయడంతో పాటు, ప్రసారాలపై నిషేధం విధించే హక్కు కేంద్రానికి ఉందని తెలిపింది.

Exit mobile version