అమ్మడం ఈజీ.. కొనడమే కష్టం. ఇది మధ్యతరగతి జీవన సూత్రం. సరే వాళ్లకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కనుక అలా అనుకుంటారులే అని భావించొచ్చు. మరి ప్రభుత్వాలకు ఏమైంది? ఆదాయం కోసం ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయా అని జల్లెడ పడుతోంది. ప్రభుత్వ మిగులు భూములను, అంతగా ఉపయోగంలో లేని భవనాలను అమ్మడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే పనిలో ఉంది.
ప్రభుత్వ సంస్థల దగ్గర మిగులు భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి.. భవనాల పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై ఇప్పటికే లెక్కలు తయారైనట్టు తెలుస్తోంది. వాటిని అమ్మడం లేదా తనఖా పెట్టడం ద్వారా ఆదాయాన్ని పొందడానికి ప్లాన్ చేసింది కేంద్రం. ఆ ఆదాయాన్ని ఆర్థిక, సామాజిక మౌలిక వసతులకు కేటాయించాలని నిర్ణయించింది. అందుకే కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భూ నగదీకరణ సంస్థ – నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్-ఎన్ఎల్ఎంసీ. దీనిని రూ.5000 వేల కోట్ల మూలధనంతో ఏర్పాటు చేయడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం కేంద్రమే ముందుగా రూ.150 కోట్లను అందించనుంది. ఈ సంస్థ చేసే ముఖ్యమైన పని ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలో ఉన్న భవనాలు, మిగులు భూములు, ఇతర ఆస్తుల వివరాలను సేకరిస్తుంది. నిజానికి ఈ సంస్థను ఏర్పాటు చేస్తామని 2021-22 బడ్జెట్ లోనే చెప్పింది మోదీ ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల దగ్గర భారీ ఎత్తున మిగులు భూములు, భవనాలు ఉన్నాయి. వీటిని మూడు వర్గాలుగా చేశారు. ఈ పీఎస్యూలను ఎలాగూ ప్రైవేటీకరించడానికి, మూసివేయడానికో నిర్ణయం తీసుకున్నందున వాటి మిగులు భూములను, ఉపయోగంలో లేని ఆస్తులను అమ్మకానికి కాని, తనఖాకు కాని ఇచ్చి లాభపడాలన్నది కేంద్రం వ్యూహం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ జోరుమీదు ఉంటుందని అంచనా వేస్తోంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాయి.