Central Govt: కేంద్రంలో 8.72 లక్షల కొత్త ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు జీవితంలో సెటిల్ అవుదామా అని ఆశగా ఎదురుచూసేవారు కోట్లలో ఉంటారు.

  • Written By:
  • Publish Date - April 5, 2022 / 12:34 PM IST

ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు జీవితంలో సెటిల్ అవుదామా అని ఆశగా ఎదురుచూసేవారు కోట్లలో ఉంటారు. అలాంటివారికి నిజంగానే ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్రంలో 8.72 లక్షల కొత్త ఉద్యోగాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిలో భర్తీ అయ్యేవి ఎన్నో చెప్పలేకపోయినా.. త్వరలో కొలువుల జాతర మాత్రం ఉంటుందని అర్థమవుతోంది. ఎందుకంటే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. అది కూడా 2024 ఎన్నికల లోపే జరగాలని చెప్పినట్టు సమాచారం. ప్రతిపక్ష పార్టీలు పదే పదే వివిధ శాఖల్లో ఖాళీల భర్తీలపై ప్రశ్నించడం, ఎన్నికల్లో దీనినే ప్రచారాస్త్రంగా చేసుకుంటుండడంతో మోదీ ప్రభుత్వం ఈమేరకు జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది.

కేంద్రం పరిధిలో ఉన్న 77 మంత్రిత్వశాఖలతోపాటు డిపార్ట్ మెంట్లలో మొత్తం 8,72,243 ఖాళీలు ఉన్నాయి. ఇది 2020 మార్చి నాటి లెక్క. ఇందులో రైల్వేలో ఉన్న ఖాళీలే.. 2,94,687. వీటిలో కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక రక్షణ రంగం, హోం శాఖ, రెవెన్యూశాఖ, పోస్టల్ డిపార్ట్ మెంట్ లలో కూడా భారీగా ఖాళీలున్నాయి. కేంద్రం ఇప్పుడు ఉద్యోగాల భర్తీని మొదలుపెడితే.. అవన్నీ పూర్తవ్వడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు పడుతుంది. ఎందుకంటే ఆర్మీలో కొలువులను భర్తీ చేయాలంటే.. ఫిజికల్ టెస్ట్ లతోపాటు పరీక్షలు, ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్టులు పూర్తిచేయాలి. దీనికి ఆరు నెలలైనా పడుతుంది. పైగా వారికి ఏడాదిపాటు ట్రైనింగ్ ఉంటుంది. కేంద్ర పోలీస్ శాఖల్లోనూ ఇదే తీరు. ఆ తరువాతే వారిని డ్యూటీలోకి తీసుకుంటారు. అందుకే ఇదంతా భారీ కసరత్తే.

మోదీ ప్రభుత్వం వచ్చాక కొత్త ఉద్యోగాలను బాగానే సృష్టించింది. అందుకే ఇప్పుడు ఖాళీల సంఖ్య దాదాపు 40 లక్షలకు చేరుకుంది. కాకపోతే ఇవన్నీ భర్తీ చేయాలంటే.. ఆ ప్రక్రియ వేగంగా జరగాలి. ఎందుకంటే రైల్వేలో ఏటా 80 వేల మంది రిటైర్ అవుతుంటారు. అంటే రెండేళ్లలో ఉండే ఖాళీలను దృష్టిలో పెట్టుకుని రిక్రూట్ మెంట్లు చేస్తుండాలి. లేకపోతే ఆ పోస్టులను అంత త్వరగా భర్తీ చేయడం సాధ్యం కాదు. మిగిలిన శాఖల్లోనూ ఇదే తీరుతో వెళితే.. త్వరలో లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంటుంది.