Site icon HashtagU Telugu

Shiv Sena rebels: మహారాష్ట్రలో ఆ 15 మంది ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం

Shiv Sena Shinde

Shiv Sena Shinde

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా ముగిసిపోలేదు. కానీ శివసేన రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. అందుకే ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్రం.. సీఆర్పీఎఫ్ వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. దీనివల్ల వారితోపాటు వారి కుటుంబాలకు కూడా రక్షణ లభిస్తుంది. వైప్లస్ కేటగిరి భద్రతను కల్పిస్తే.. దానికోసం 39 మంది సిబ్బంది పహారా కాస్తారు. ఇద్దరు నుంచి నలుగురు కమాండోలతోపాటు 11 మంది పోలీసులు సెక్యూరిటీని ఇస్తారు. ఇలా మూడు షిప్టుల్లోనూ కాపలా ఉంటారు. 2 నుంచి 3 వాహనాలను కూడా సమకూరుస్తారు.

అటు శివసేనను చీల్చడానికి ప్రయత్నించిన ఏక్ నాథ్ షిండే టీమ్ లోని సుమారు 20 మంది ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ థాకరేతో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం.. వారు బీజేపీలో విలీనమవ్వడానికి ఇష్టపడకపోవడమే. పైగా అసమ్మతి ఎమ్మెల్యేలపై ఇప్పటికే వ్యతిరేకత పెరుగుతోంది. శివసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరా ప్రదర్శనకు దిగారు. దీనికి పోటీగా అటు షిండేకు మద్దతు తెలిపేవారు ఠాణేలో నిరసనలకు దిగారు.

షిండేతోపాటు ఇతర రెబల్ మంత్రులపై చర్యలు తీసుకోవడానికి శివసేన యోచిస్తోంది. దీనివల్ల షిండే గ్రూప్ లో ఉన్న షిండే, గులాబ్ రావు పాటిల్, దాదా భూసే వంటి మంత్రులు తమ శాఖలను కోల్పోతారు. వారితోపాటు సహాయమంత్రులపైనా చర్యలు తప్పేలా లేవు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఉన్న ఏక్ నాథ్ షిండేను ఆ పదవి నుంచి తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కాని దానిపై న్యాయసలహా తీసుకున్న తరువాతే కోర్టుకు వెళ్లాలని షిండే వర్గం ఆలోచిస్తోంది.