Rajnath Singh : ‘అగ్నిపథ్’ పై వెనక్కు తగ్గని కేంద్రం.. త్వరలో రిక్రూట్ మెంట్లు!

  • Written By:
  • Updated On - June 17, 2022 / 03:52 PM IST

అగ్నిపథ్ పథకంపై కేంద్రం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఓవైపు దేశవ్యాప్తంగా ఆందోళనకారులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. కేంద్రం మాత్రం.. ఆ పథకం కింద రిక్రూట్ మెంట్లు త్వరలోనే ప్రారంభమవుతాయని అంటోంది. ఈమేరకు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అగ్నిపథ్ లో చేరాలనుకునేవారంతా దానికి సిద్ధంగా ఉండాలన్నారు. నిజానికి ఈ స్కీమ్ కింద నియామకాల వల్ల తమకు అనాయం జరుగుతుందని యువతరం ఆందోళన చెందుతోంది. కాని కేంద్రం మాత్రం.. ఇది గోల్డెన్ ఛాన్స్ అంటోంది. గత రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు లేవు. దీనివల్ల వయసు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా.. అభ్యర్థుల వయోపరిమితిని మోదీ రెండేళ్లు పెంచారన్నారు రాజ్ నాథ్ సింగ్. అంటే 21 నుంచి 23 ఏళ్లకు పెరిగింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్కసారికి మాత్రమే ప్రభుత్వం ఈ మినహాయింపును ఇస్తోందన్నారు. దీనివల్ల ఎక్కువమందికి అగ్నివీరులుగా మారే అవకాశం ఉందన్నారు.

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్నది ఎంతోమంది కల. యువతరంలో చాలా మంది దీనికోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతారు. శారీరక దారుఢ్యం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. అందుకే దానికి ఆశావహులు ఎక్కువగా ఉంటారు. కానీ కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం వల్ల తమ ఆశలు అడియాసలు అవుతాయని వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. కానీ రాజ్ నాథ్ సింగ్ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రోడ్లు-రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఒకేలాంటి వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనలను వారు లెక్కలోకి తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.