Site icon HashtagU Telugu

Medicines : దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారికి గుడ్ న్యూస్.. 35 మందుల ధరలు తగ్గించిన కేంద్రం

Center reduces prices of 35 medicines

Center reduces prices of 35 medicines

Medicines : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రజలపై ఉన్న ఔషధ ఖర్చును తగ్గించేందుకు దేశవ్యాప్తంగా 35 రకాల మందుల ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఒంటినొప్పులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే మందుల ధరలు తగ్గించడమే ఈ నిర్ణయ లక్ష్యం. ఈ నిర్ణయాన్ని కేంద్ర రసాయనిక ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) కొత్త ధరల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం పారాసెటమాల్‌, అటోర్వాస్టాటిన్‌, ఎంపాగ్లిఫ్లోజిన్ వంటి మందులు కూడా ధర తగ్గింపులో భాగంగా ఉన్నాయి.

Read Also: Gold Price : సామాన్యుడి అందనంత ధరల్లో బంగారం, వెండి ధరలు

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తయారు చేసే యేసిలోఫెనాక్-పారాసెటమాల్-ట్రైప్సిన్ కైమోట్రిప్సిన్ ట్యాబ్లెట్ ధరను రూ.13గా నిర్ణయించగా, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఇదే ఔషధాన్ని రూ.15కి విక్రయించనుంది. గుండె సంబంధిత వ్యాధులకు ఉపయోగించే అటోర్వాస్టాటిన్ 40 mg + క్లోపీడొగ్రెల్ 75 mg కాంబినేషన్ ట్యాబ్లెట్ ధరను రూ.25.6గా నిర్దేశించారు. చిన్నారులకు ఇవ్వబడే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్స్ ధరలను తగ్గించారు. అదే విధంగా విటమిన్ D లోపం ఉన్నవారు వాడే కోలికాల్సిఫెరాల్ డ్రాప్స్, అలాగే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ధరను రూ.31గా నిర్ణయించారు. ప్రజలకు ఇవన్నీ అందుబాటులో ఉండేలా మెడికల్ షాపుల్లో ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్రం ఆదేశించింది. ఔషధాలు నిర్ణీత ధరలకు మించి విక్రయించినా, ఔషధ ధరల నియంత్రణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. రూల్స్ ఉల్లంఘించిన వారి మీద జరిమానాలు విధించే అవకాశముందని పేర్కొంది. అంతేకాదు, ఈ తగ్గింపు ధరల్లో GST చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఔషధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపై కొత్త ధరల సమాచారాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో (IPDMS) అప్‌డేట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇదే సమాచారం NPPA మరియు రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్స్‌కు సమర్పించాలని పేర్కొంది. ఈ తాజా నిర్ణయంతో పాటు, ప్రస్తుతంలో అమల్లో ఉన్న ఔషధ ధరల ఉత్తర్వులను రద్దు చేసినట్టు కూడా స్పష్టం చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ ధరల తగ్గింపుతో ఆర్థికంగా స్వల్ప ఊరట పొందనున్నారని భావిస్తున్నారు. కొన్ని మందులపై గరిష్ట ధరలు తగ్గించడం వల్ల ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునే వ్యయ భారం కూడా తగ్గనుంది. PPA అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మందుల ధరల జాబితా లభిస్తుంది. ప్రజలు అక్కడ చూసి తమ అవసరాలకు తగ్గ ఔషధాలను సరసమైన ధరకు పొందవచ్చు. ఎవరైనా ఈ మందులను నిర్ణీత ధరల కన్నా ఎక్కువ ధరకు అమ్మితే తమకు ఫిర్యాదు చేయవచ్చని, వెంటనే చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజల ఆరోగ్యానికి మేలు చేసిందని, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకునే వారికి ఇది పెద్ద ఊరటగా మారుతుందని అంటున్నారు.

Read Also: ITR Filing : మొదటిసారి ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా..? మీకు కావాల్సిన ముఖ్యమైన పత్రాల జాబితా ఇదే..!