West Bengal floods: పశ్చిమబెంగాల్‌ను వరదలు ముంచెత్తుతుండటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వరద సాయం అందించడంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందంటూ తప్పుపట్టారు. తీవ్ర వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఉత్తర బెంగాల్‌లో ఆదివారం పర్యటించేందుకు బయలు దేరుతూ మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడారు.
Read Also: Raja Singh : ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరి అరెస్ట్..!
”కేంద్రం చేసిందేమీ లేదు, ఉత్తర బెంగాల్ మొత్తం జలదిగ్బంధంలో ఉంది. పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు అక్కడకు వెళ్తున్నాను. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చాలా పెద్ద పెద్ద హామీలే ఇస్తారు, ఆ తర్వాత కనిపించరు. ” అంటూ కేంద్రంపై సీఎం మండిపడ్డారు. నేపాల్ నుంచి విడుదలైన 5 లక్షల క్యూసెక్యుల కోసీ నదీ జలాలతో రాష్ట్రాంలోని అనేక ప్రాంతాలు జలవిలయంలో చిక్కుకున్నాయని ఆరోపించారు. కూచ్ బెహర్, జల్పాయిగురి తదితర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయని చెప్పారు. దక్షిణ బెంగాల్‌లోని ఏడు జిల్లాల్లో తాను పర్యటించానని, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్‌ల వద్ద డ్రెడ్జింగ్ చేయడంలో కేంద్రం విఫలం కావడంతో బెంగాల్‌లోని పలు జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయని ఆరోపించారు. దీనికి డీవీసీనే బాధ్యత వహించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, రాష్ట్ర యంత్రాంగం సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటోందని చెప్పారు. చీఫ్ సెక్రటరీని నార్త్ బెంగాల్‌కు పంపామని, అక్కడి ప్రజలందర్నీ శనివారం రాత్రి సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. తాను కూడా అక్కడకు చేరుకుని అధికారులతో సమీక్ష జరిగిన తర్వాత మరింత సమాచారాన్ని తెలియజేస్తానన్నారు.
Read Also: TIrumala Laddu – Sit Enquiry : కీలక డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు