CBI Report: సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక.. కోల్‌కతా ఘటనపై దర్యాప్తులో కీలక పరిణామం

సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు జూనియర్ లాయర్లు, హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ వేసిన లెటర్ పిటిషన్ల ఆధారంగా ఈ కేసును భారత సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది.

Published By: HashtagU Telugu Desk
Cbi Supreme Court

CBI Report: ఆగస్టు 9న తెల్లవారుజామున కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై ఘోర హత్యాచారం జరిగింది. ఈ ఘటనపై గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ  సీబీఐ దాని తాజా నివేదికను ఇవాళ సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20న  సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు జూనియర్ లాయర్లు, హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ వేసిన లెటర్ పిటిషన్ల ఆధారంగా ఈ కేసును భారత సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ కేసును ఆగస్టు 20న విచారించిన సుప్రీంకోర్టు.. గురువారంకల్లా తమకు స్టేటస్ రిపోర్టును అందించాలని సీబీఐని ఆదేశించింది. దాని అమలులో భాగంగానే ఇవాళ విచారణ నివేదికను కోర్టుకు సీబీఐ అందజేసింది. ఇప్పటివరకు ఎవరెవరిని ప్రశ్నించారు ? నిందితులు చెప్పిన సమాధానాలు ఏమిటి ? కేసులో ప్రధాన అనుమానితులు ఎవరెవరు ఉన్నారు ? బాధిత జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు అందించిన సమాచారం ఏమిటి ? అనే ఇన్ఫర్మేషన్‌ సీబీఐ నివేదిక(CBI Report)లో ఉందని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం తరఫున  ప్రముఖ న్యాయవాది కపిల్‌సిబల్‌ నేతృత్వంలోని 21 మంది న్యాయవాదుల బృందం వాదనలు వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సారథ్యంలోని ఐదుగురు న్యాయవాదుల బృందం వాదనలు వినిపిస్తోంది. మంగళవారం రోజు జరిగిన విచారణలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ‘‘ఆస్పత్రిలో అరాచకం జరుగుతుంటే పోలీసులు ఏం చేశారు ? డెడ్ బాడీ అంత్యక్రియలు పూర్తయ్యేదాకా  ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు ?’’ అనే ప్రశ్నలను బెంగాల్ పోలీసు శాఖకు సుప్రీంకోర్టు సంధించింది. ‘‘జూనియర్ వైద్యురాలు హత్యకు గురైందని తెలిసి కూడా.. దాన్ని ఆత్మహత్యగా రిపోర్ట్ చేసేందుకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎందుకు ప్రయత్నించారు?’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈనేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం కల్లా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించనున్నట్లు తెలుస్తోంది.

Also Read :Trump : ట్రంప్‌కు జై.. రాబర్ట్ ఎఫ్.కెనడీ జూనియర్ కీలక నిర్ణయం

  Last Updated: 22 Aug 2024, 11:51 AM IST