CBI Raid:ఆర్జేడీ నేతల ఇళ్ళల్లో సీబీఐ సోదాలు

బీహార్‌ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి.

  • Written By:
  • Updated On - August 24, 2022 / 01:24 PM IST

బీహార్‌ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆర్జేడీ నేతల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. లాలూప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు, ఆర్జేడీ కోశాధికారిగా ఉన్న ఎమ్మెల్సీ సునీల్‌సింగ్‌ నివాసంలో సోదాలు చేపట్టారు. ఆయనతో పాటు పలువురు నేతల ఇళ్ళల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. లాలూ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. లాలూ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భోలా యాదవ్‌ ఓఎస్‌డీ అధికారిగా ఉన్నారు. పాట్నా, దర్భంగాలోని బోలా యాదవ్‌కు చెందిన నాలుగు ప్రాంగణాల్లో సీబీఐ సోదాలు నిర్వహించి, అతని పూర్వీకుల ఇంటి నుంచి నేరారోపణ పత్రాలు, డైరీని స్వాధీనం చేసుకుంది.

ఇక, ఈ కేసులో ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్ రైల్వే జోన్‌లలో ఉద్యోగాలు పొందిన 12 మందితో పాటు లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లపై సీబీఐ మే 18న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే విశ్వాస పరీక్షకు ముందు ఉధ్ధేశపూర్వకంగానే కేంద్రం ఈ సోదాలు చేయిస్తోందని ఆర్జేడీ నేతలు ఫైర్ అయ్యారు. భయంతో ఎమ్మెల్యేలు వారికి అనుకూలంగా వస్తారని భావించి ఇలా చేస్తున్నారని సునీల్ సింగ్ ఆరోపించారు. బిహార్‌‌ సీఎం నితీష్ కుమార్ నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొన్నారు. బిహార్‌లో ఇటీవల జేడీయూ, ఆర్జేడీ, ఇతర పార్టీలతో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది.