CBI Court : బెంగాల్ మాజీ మంత్రి పార్థ‌చ‌ట‌ర్జీ బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌రించిన సీబీఐ కోర్టు

పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు మరో ఆరుగురి బెయిల్

  • Written By:
  • Publish Date - January 20, 2023 / 06:53 AM IST

పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు మరో ఆరుగురి బెయిల్ దరఖాస్తును కోల్‌కతాలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. మొత్తం ఏడుగురు నిందితులు తమ చివరి టర్మ్ జ్యుడిషియల్ కస్టడీ పూర్తికావడంతో వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు మొత్తం ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి.. జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. వారందరినీ ఫిబ్రవరి 2న మళ్లీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. పార్థ ఛటర్జీ తరపు న్యాయవాది సెలిమ్ అహ్మద్ త‌న వాద‌న‌ల‌ను వినిపించారు. పార్థ‌చ‌ట‌ర్జీ టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేద‌ని వాదించారు. పార్థ ఛటర్జీకి బెయిల్ మంజూరైతే వెంటనే మంత్రి వ‌ర్గంలో చేర‌ర‌ని. ఈ కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తార‌ని పార్థ చ‌ట‌ర్జీ త‌రుపున న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు.

అయితే పార్థ చ‌ట‌ర్జీ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరింది. అర్హత లేని అభ్యర్థులను అక్రమ పద్ధతిలో రిక్రూట్ చేసుకున్నారని, ఈ కేసులో భారీగా డబ్బు తీసుకున్నార‌ని దర్యాప్తు సంస్థ తెలిపింది. అనంతరం బెయిల్ పిటిషన్‌లను తిరస్కరించిన కోర్టు, అరెస్టయిన నిందితులందరికీ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై పార్థ ఛటర్జీని జూలై 2022లో అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 ప్రకారం మాజీ మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్థ ఛటర్జీని అన్ని మంత్రిత్వ శాఖల నుండి తొలగించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) కూడా ఆయనను పార్టీలో ఉన్న అన్ని పదవుల నుండి తొలగించింది.