Site icon HashtagU Telugu

Unlock EVM : ఫోన్‌తో ఈవీఎం అన్‌లాక్ చేసిన ఎంపీ బావమరిది.. కేసు నమోదు

Unlock Evm

Unlock Evm

Unlock EVM :  వాయవ్య ముంబై లోక్‌సభ స్థానంలో వచ్చిన ఎన్నికల ఫలితాలపై దుమారం రేగుతోంది. అక్కడ వెలువడిన ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ చాలామంది అభ్యర్థులు స్థానిక పోలీసులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఇక్కడ 48 ఓట్ల తేడాతో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్‌ను షిండే శివసేన అభ్యర్థి  రవీంద్ర వైకర్ ఓడించారు. వైకర్‌కు 4,52,644 ఓట్లు రాగా, గజానన్ కీర్తికర్‌కు 4,52,596 ఓట్లు వచ్చాయి. ఈ  వ్యవహారంపై పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో మరో సంచలన విషయం(Unlock EVM) వెలుగుచూసింది..

We’re now on WhatsApp. Click to Join

శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) లోక్‌సభ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో రవీంద్ర వైకర్ పోటీ చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ రోజు రవీంద్ర వైకర్ బావమరిది మంగేష్ పండిల్కర్.. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలను తన మొబైల్ ఫోన్ ద్వారా అన్‌లాక్ చేశారని దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంలను అన్‌లాక్ చేసే అధికారం కేవలం అక్కడున్న ఎన్నికల అధికారి దినేష్ గురవ్‌కు  మాత్రమే ఉంటుంది. ఇందుకోసం సదరు అధికారి తన ఫోన్‌ను వాడాల్సి ఉంటుంది. అయితే ఆ ఎన్నికల అధికారి తన ఫోన్‌ను షిండే శివసేన లోక్‌సభ అభ్యర్థి  రవీంద్ర వైకర్ బావమరిది మంగేష్ పండిల్కర్‌కు ఇచ్చారని.. ఆ ఫోనుతోనే ఈవీఎంను మంగేష్ పండిల్కర్‌ అన్‌లాక్ చేశారని విచారణలో పోలీసులు గుర్తించారు.

Also Read :Rahul Gandhi : ఈవీఎంలు బ్లాక్‌బాక్స్‌లుగా మారాయ్.. తనిఖీ చేయనివ్వరా ?:రాహుల్‌గాంధీ

ఈ విషయాన్ని వాయవ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఒకరు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 188 సెక్షన్ కింద పండిల్కర్‌పై కేసు పెట్టారు. పండిల్కర్‌తో పాటు ఫోన్‌ను ఉపయోగించే ఎన్నికల సంఘం అధికారి వాంగ్మూలాలను తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరారు.  జూన్ 4న ఓట్ల లెక్కింపు జరిగిన రోజున ఉదయం నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఆ ఫోనును ఎంపీ బావమరిది మంగేష్ పండిల్కర్‌ వాడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ దినపత్రిక క్లిప్‌ను ప్రశాంత్ భూషణ్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇండియా కూటమి గెలవాల్సిన ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజేతగా నిలిచాడంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Largest Underground Station : భారీ భూగర్భ రైల్వే స్టేషన్.. ఒకే ట్రాక్​పై మెట్రో, నమో భారత్​ ట్రైన్స్