Car Racing:కార్ రేసింగ్ వల్ల తప్పని ట్రాఫిక్ ఆంక్షలు!

కార్ రేసింగ్ కారణంగా హైదరాబాదీలకు ట్రాఫిక్ చిక్కులు

  • Written By:
  • Updated On - December 6, 2022 / 10:34 PM IST

హైదరాబాద్ లో ఈనెల 9 నుంచి మొదలు కాబోతున్న కార్ రేసింగ్ మీద ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ కార్ రేసింగ్ నిర్వహించబడుతుంది. కార్ రేసింగ్ సంగతి అటు ఉంచితే దీనివల్ల ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పేట్టుగా లేదు.

ఈ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 11 వరకు ఎన్టీఆర్ మార్గ్ మరియు నెక్లెస్ రోడ్ ప్రాంతాలలో ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వస్తాయని పోలీసు శాఖ తెలిపారు. మొన్న నవంబర్ లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో నిర్వహించిన ఇండియా కార్ రేసింగ్ లీక్ అర్ధాంతరంగా ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నవంబర్ 19 ,20 న జరగాల్సిన షో ను రద్దు చేశారు. ఈ క్రమంలో టికెట్లు కొన్న వారికి కూడా డబ్బు వాపసు ఇవ్వడం జరిగింది.

కానీ ప్రస్తుతం జరగనున్న ఈ కార్ రేస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్ఎండిఏ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్ రేస్ సందర్భంగా పలు రోడ్లు మూసివేయడం జరిగింది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్ మరియు ఐమాక్స్ రోటరీ వైపు వెళ్లే అన్ని రోడ్లను మూసివేశారు.

బుద్ధ భవన్, నల్లగుట్ట జంక్షన్ మీదుగా ఐమాక్స్ వైపు వెళ్లే రోడ్డు మార్గంపై వాహనాలకు ప్రవేశం నిషిద్ధం. అలాగే మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోడ్ వైపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుంచి నెక్లెస్ రోడ్ వైపు వెళ్లే దారిని కూడా క్లోజ్ చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ గార్డెన్ , ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ మరియు లుంబిని పార్క్ వైపు రోడ్లు అన్నీ మూసివేశారు.

మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్ జనాలకు ట్రాఫిక్ కష్టాలు తప్పవు. ఈసారి ఎలాగైనా సరే ఈ కార్ రేస్ ని సమర్థవంతంగా నిర్వహించి గత నెల జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని హెచ్ఎండిఏ గట్టి పట్టుదల మీదే ఉంది అని సమాచారం.