Maharashtra : సామాజిక మాధ్యమాల్లో పాపులర్ కావాలనే ఉద్దేశంతో కొందరు యువత ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ప్రజా ప్రదేశాల్లో విన్యాసాలు చేస్తూ తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇటువంటి ఓ ఘటన మహారాష్ట్రలోని ఓ పర్యాటక ప్రదేశంలో చోటుచేసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓ యువకుడు కారుతో విన్యాసాలు చేస్తూ అదుపుతప్పి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయాడు. ఈ దృశ్యం వీడియో రూపంలో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లాలోని పఠాన్-సదావాఘాపుర్ మార్గంలో, గుజర్వాడి సమీపంలో జరిగింది. ఇది కారాడ్ పట్టణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. సాధారణంగా ఈ ప్రాంతం పర్యాటకులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది.
పర్యాటక కొండపై ప్రమాదం.. కారు 300 అడుగుల లోయలోకి! మహారాష్ట్ర పఠాన్-సదావాఘాపుర్ మార్గంలో స్నేహితులతో కారులో కొండపైకి వెళ్లిన సాహిల్ జాదవ్. విన్యాసాల సమయంలో అదుపు తప్పిన కారు 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. #viralvideo #Car #Accident #HashtagU pic.twitter.com/XzV79IeRgD
— Hashtag U (@HashtaguIn) July 11, 2025
కరాడ్‌కి చెందిన గోలేశ్వర్ ప్రాంత వాసి సాహిల్ జాదవ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఈ పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు వచ్చారు. అయితే, వీడియోల కోసం ఆకర్షణీయ విన్యాసాలు చేయాలని భావించి కారుతో కొండ అంచుల వద్ద డ్రిఫ్టింగ్ చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అతడి కారు అదుపుతప్పి నేరుగా 300 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో సాహిల్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి వెంటనే స్పందించిన స్థానికులు సహాయక బృందాలకు సమాచారం అందించి, అతన్ని పైకి తీసివచ్చారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు, యువత ఈ విధమైన సాహసాలతో తమ ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. పర్యాటక ప్రదేశాల్లో ప్రమాదకర విన్యాసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాక, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. గుజర్వాడి ప్రాంతంలోని ఈ పర్యాటక ప్రాంతం భద్రతాపరంగా పూర్తిగా విస్మరించబడినట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద లోయలు ఉండే ఈ ప్రాంతంలో రక్షణ గేడీలు, హెచ్చరికా బోర్డులు వంటి ప్రాథమిక భద్రతా మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, లేకపోతే మరిన్ని ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నారు.
సాహిల్ చేసిన విన్యాసం వీడియో, అతడి కారు లోయలో పడిపోతున్న దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక వీడియో కోసం అంతటి రిస్క్ అవసరమా? “ప్రాణం కన్నా ఎక్కువ వ్యూస్ ఏమైనా ఉంటాయా?” అనేలా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన మరోసారి స్పష్టంచేస్తోంది. పాపులారిటీ కోసం చేసే విన్యాసాలు మన జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చివేస్తాయి. ప్రతి వీడియో వెనక మనుగడ ఉండాలి. కనుక యువత సాధ్యమైనంతవరకు ఈ రకమైన ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండాలి. తప్పకుండా భద్రతా నియమాలను పాటించాలి. పోలీసుల సూచనలను గౌరవించాలి.