కొత్త పార్టీ దిశ‌గా కెప్టెన్ అమ‌రేంద్ర సింగ్.. రైతుల కోసం కాంగ్రెస్, బీజేపీకి స‌మ‌దూరం

పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రేంద్ర సింగ్ వేసే రాజకీయ అడుగులు మీద దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కొత్త పార్టీ పెట్ట‌బోతున్న‌ట్టు తాజాగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • Written By:
  • Publish Date - October 5, 2021 / 11:12 AM IST

పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి అమ‌రేంద్ర సింగ్ వేసే రాజకీయ అడుగులు మీద దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కొత్త పార్టీ పెట్ట‌బోతున్న‌ట్టు తాజాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోని అంత‌ర్గ‌త క‌మ్ములాట‌ల కార‌ణంగా మ‌రికొన్ని నెల‌ల్లో సాధార‌ణ ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ అమ‌రేంద్ర ను సీఎం ప‌ద‌వి నుంచి అధిష్టానం త‌ప్పించింది. ఆయ‌న స్థానంలో దళిత సీఎంను నియ‌మించారు. ద‌ళిత ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ ఎత్తుగ‌డ వేసింది. దీంతో అమరేంద్ర‌సింగ్ కాంగ్రెస్ పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. ఇదంతా సిద్దూ కార‌ణంగా జ‌రిగింద‌ని ఆగ్ర‌హంగా ఉన్నారు. అందుకే సిద్ధూను సీఎం చేయ‌కుండా సింగ్ అడ్డుకోగ‌లిగారు. కానీ, తాజా రాజ‌కీయ పరిణామాల‌తో సిద్ధూ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యాడు. ఇలాంటి రాజ‌కీయ సంక్షోభం నేప‌థ్యంలో అమ‌రేంద్ర‌సింగ్ కొత్త పార్టీ ప్ర‌చారం తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చింది.
కాంగ్రెస్ అధిష్టానం మీద ఆగ్ర‌హంగా ఉన్న అమ‌రేంద్ర‌సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా జ‌రిగిన ఈ భేటీ త‌రువాత సింగ్ బీజేపీ వైపు వెళ‌తార‌ని జాతీయ మీడియా కోడై కూసింది. అలాంటి ప్ర‌చారానికి తెర‌వేస్తూ, బీజేపీలోకి వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని అమ‌రేంద్ర‌సింగ్ మీడియా ఎదుట తేల్చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీతో కూడా ఉండ‌నని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. ఇక మూడో ఆప్ష‌న్ కొత్త పార్టీ పెట్ట‌డ‌మే. అందుకే ఇప్పుడు కొత్త పార్టీ దిశ‌గా అమ‌రేంద్ర సింగ్ అడుగులు వేస్తున్నాడ‌ని లేటెస్ట్ టాక్ .
వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన రాష్ట్రాల్లో పంజాబ్ మొద‌టిది. ఆ రాష్ట్ర రైతులు సుద‌ర్ఘ కాలంగా పోరాడుతూనే ఉన్నారు. వాళ్ల‌కు అండ‌గా అమ‌రేంద్ర‌సింగ్ ప్ర‌భుత్వం నిలిచింది. రైతుల‌కు అండ‌గా ఉన్నాడ‌ని అమ‌రేంద్ర‌కు కూడా పేరుంది. పంజాబ్ నుంచి న‌డిపిన రైతు ఉద్యమం కాంగ్రెస్ పార్టీకి ఊపునిచ్చింది. ఆ క్రిడెట్ ఎక్కువ భాగం అమ‌రేంద్ర‌కు వెళుతుంది. అందుకే, ఆయ‌న రైతుల ప‌క్షాన నిల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ కార‌ణంగానే అమిత్ షాతో భేటీ అయిన‌ప్ప‌టికీ బీజేపీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన అవ‌మానాన్ని అమ‌రేంద్ర‌సింగ్ త‌ట్టుకోలేక‌పోతున్నాడు. ఈ క్ర‌మంలో రైతుల కోసం కొత్త పార్టీ దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నాడ‌ని బ‌ల‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. అది ఎంత వ‌ర‌కు సాధ్యం అవుతుందో వేచిచూడాల్సిందే.