Site icon HashtagU Telugu

Rajiv Gandhi Foundation:రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు…విదేశీ నిధుల ఆరోపణలపై చర్యలు..!!

Rajiv (1)

Rajiv (1)

గాంధీ కుటుంబానికి అనుబంధంగా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనే NGO ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది . 2020లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్-మంత్రిత్వ కమిటీ విచారణ తర్వాత ఈ చర్యలు తీసుకుంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పై విచారణ జరిపిన అనంతరం ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు . ఇదే కాకుండా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు సంబంధించిన ఇతర ట్రస్ట్ లలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ స్థాపించారు. 1991 జూలైలో సోనియా గాంధీ నేతృత్వంలో ఫౌండేషన్ కోసం తీర్మానం ఆమోదించింది. 1991లో స్థాపించిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ 1991 నుండి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, వికలాంగుల సహాయం మొదలైన అనేక ముఖ్యమైన సమస్యలపై పని చేసింది. అంతేకాదు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వెబ్‌సైట్ ప్రకారం, సంస్థ విద్యా రంగంలో కూడా పనిచేసింది.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లకు చైనా నుండి నిధులు అందుతున్నయన్న విషయంపై దర్యాప్తుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ), ఆదాయపు పన్ను చట్టం, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) మొదలైన పలు చట్టపరమైన నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు చేసేందుకు మంత్రిత్వ శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.