Hardeep Nijjar : ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు తాజాగా నాలుగో అరెస్టు చేశారు. కెనడాలోని బ్రాంప్టన్ నగరానికి చెందిన 22 ఏళ్ల భారతీయుడు అమర్‌దీప్ సింగ్‌ను ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్‌ఐటి) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై ఫస్ట్ డిగ్రీ హత్య, హత్యకు కుట్ర అభియోగాలను మోపారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Nijjar) హత్యలో అమర్‌దీప్ పాత్ర ఉందని అధికారులు వెల్లడించారు. అక్రమంగా తుపాకీని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై ఇప్పటికే పీల్ ప్రాంతీయ పోలీసుల అదుపులో ఉన్న అమర్‌ను.. తాజాగా శనివారం రోజు ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
హర్దీప్ సింగ్ నిజ్జర్ (45) 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న గురునానక్ సిక్కు గురుద్వారా వెలుపల హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో మే 3న ఇప్పటికే ముగ్గురు భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వారి పేర్లు కరణ్ బ్రార్ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్‌ప్రీత్ సింగ్ (28) అని వెల్లడించారు. ఈ ముగ్గురు కూడా ఎడ్మంటన్‌లో నివసించే వారని తెలిపారు. వీరిపైనా ఫస్ట్ డిగ్రీ హత్య, హత్యకు కుట్ర అభియోగాలను మోపారు.
Also Read : Iran Vs Israel : ఇజ్రాయెల్ ఖబడ్దార్.. అణుబాంబులు తయారు చేస్తాం : ఇరాన్
నిజ్జర్ హత్య కేసులో వరుస అరెస్టుల వెనుక కెనడా అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని భారత్ ఇటీవల ఆరోపించింది. వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు ట్రూడో సర్కారు రాజకీయ వేదికగా మారిందని తెలిపింది. ఈ కేసులో భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు ఇప్పటివరకు కెనడా సాక్ష్యాధారాలను అందించలేదని స్పష్టం చేసింది. వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, హింసను ప్రోత్సహించేవారికి కెనడాలో రాజకీయ ఆశ్రయం లభిస్తోందని భారత్ ఆవేదన వ్యక్తం చేసింది. భారత దౌత్యవేత్తలు కూడా కెనడాలో బెదిరింపులను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపింది. దీనివల్ల వారి విధుల నిర్వహణకు ఆటంకం కలుగుతోందని తెలిపింది.