New Tax Rules: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఏప్రిల్ 1, 2026 నుండి ప్రభుత్వం మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బ్యాంక్ ఖాతాలు, సోషల్ మీడియాను ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చని, మీ వ్యక్తిగత సమాచారాన్ని నిఘా పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఆ వార్త సారాంశం. ఈ వార్త ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టతనిస్తూ ఇది కేవలం ఒక పుకారు మాత్రమేనని తేల్చి చెప్పింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్‌ల ప్రకారం.. ప్రభుత్వం ‘ఆదాయపు పన్ను చట్టం- 2025’ లో పన్ను ఎగవేతను అరికట్టడానికి ఐటీ శాఖకు అపరిమిత అధికారాలను ఇచ్చిందని, దీని కింద అధికారులు మీ వ్యక్తిగత కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్స్, సోషల్ మీడియాను ఎప్పుడైనా రహస్యంగా తనిఖీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది.
Also Read: అమెజాన్ సంచలన నిర్ణయం.. ఉత్తర కొరియా దరఖాస్తుదారులపై నిషేధం!
నిజం ఏమిటి? (PIB ఫ్యాక్ట్ చెక్)
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వార్తను ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే సమాచారం అని స్పష్టం చేసింది. ఐటీ శాఖకు ఎవరి డిజిటల్ స్పేస్‌లోకి అయినా చొరబడేలా ప్రభుత్వం ఎటువంటి అధికారాలను ఇవ్వలేదు. ఏప్రిల్ 1, 2026 నుండి ఆదాయపు పన్ను కొత్త నియమాలు అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఈ పుకారును ప్రజలు నిజమని నమ్ముతున్నారు.
సెక్షన్ 247 అంటే ఏమిటి?
ఆదాయపు పన్ను చట్టం, 2025లోని సెక్షన్ 247 పై తప్పుడు ప్రచారం జరుగుతోందని PIB పేర్కొంది. నిజానికి ఈ సెక్షన్ ఆదాయపు పన్ను శాఖకు ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్ (వసూలు)’ చేసుకునే అధికారాన్ని మాత్రమే ఇస్తుంది. పన్ను వివాదాలకు సంబంధించి కొంత భాగం లేదా పూర్తి మొత్తాన్ని మాఫీ చేయడానికి లేదా ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయడానికి ఈ అధికారాన్ని ఉపయోగిస్తారు. ఈ సెక్షన్ కేవలం సెర్చ్, సర్వే ఆపరేషన్లకు మాత్రమే పరిమితం. పన్ను చెల్లింపుదారుడు పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉంటే తప్ప, వారి వ్యక్తిగత డిజిటల్ సమాచారాన్ని తనిఖీ చేసే అధికారం విభాగానికి ఉండదు.
సాధారణ తనిఖీల కోసం లేదా సాధారణ పరిస్థితుల్లో పౌరుల సోషల్ మీడియాను లేదా ఫోన్ మెసేజ్‌లను చెక్ చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖకు లేదు. అటువంటి వార్తలను నమ్మవద్దని, షేర్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
